బషీర్‌బాగ్, వెలుగు: నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఆయన స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా అసమ్మతి గళాలు, -సాహిత్యం, ప్రజాస్వామ్య వరివర్తనలు, రచయితల పాత్ర అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిపారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మానవీయ సమాజం రావాలని సాయిబాబా పోరాడారని, దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్లు జైలులో ఉన్నా ఆయన అధైర్యపడలేదని చెప్పారు. తర్వాత కోర్టు నిర్దోషిగా తేల్చిందన్నారు. అయితే, జైలు జీవితంలో ఆయన కోల్పోయిన ఆరోగ్యానికి ఎవరు బాధ్యులని సమాజం ప్రశ్నించాల్సి ఉండేదని పేర్కొన్నారు.
సమాజానికి సేవ చేయాల్సిన దశలో సాయిబాబా మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రచయిత్రి మీనా కందస్వామి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, ఆర్థికవేత్త డి.నరసింహారెడ్డి, సాయిబాబా మెమోరియల్ కమిటీ సభ్యుడు రాందేవ్, సాయిబాబా కూతురు మంజీర తదితరులు పాల్గొన్నారు.
