సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో బ్యాక్ వాటర్ ప్రభావంతో మట్టపల్లి ఆలయం వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భక్తులు, ఆలయ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
మళ్లీ వరద ముప్పు తప్పదా..?
కృష్ణానది తీర ప్రాంతాల్లోని పంచనారసింహ ఆలయాల్లో మట్టపల్లి ఆలయానికి ప్రత్యేకత ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ అనంతరం ఈ ఆలయం వరద ముంపునకు గురవుతోంది. 2020 ఆగస్టు 12 నుంచి 26వ వరకు ఆలయం వరద ముంపునకు గురి కాగా నాలుగు రోజులపాటు లక్ష్మీనరసింహుడు నీటిలో మునిగిపోగా పూజారులు, అర్చకులు మెడ నీటి లోతులో గర్భగుడిలోకి వెళ్లి ఆర్జిత సేవలు అందించారు.
భక్తులు స్వామి దర్శనానికి ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలకు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరదనీటితో ఆలయ రక్షణ కోసం నిర్మించిన కరకట్ట లీకేజీ కావడంతో గుడిలోకి నీరు చేరింది. ప్రసుత్తం పుష్కర ఘాట్లు మునిగి అడుగుల మేర కరకట్ట నుంచి లీకేజీ అవుతున్నా నీరు ఆలయంలోకి వస్తుండగా పాలకవర్గం వారు రెండు హై స్పీడ్‌మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నారు.
లీకేజీ అవుతున్న కరకట్ట
సాధారణంగా ప్రాజెక్టులో సుమారు 32 టీఎంసీల నీరు నిల్వ ఉంటే పుష్కరాల ఘాట్లు, ఆలయ మెట్లు మునిగిపోతాయి. అదే 36 టీఎంసీలు ఉన్న నీటి నిల్వతో మట్టపల్లి ఆలయంలో కరకట్ట లీకేజీ ద్వారా ఆలయంలో వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 42 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో దేవాలయం వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆలయం చుట్టూ మొత్తం 21 అడుగుల మేర కరకట్ట నిర్మాణం చేపట్టారు.
ఇందులో ఐదో అడుగుకు సమీపంలో కొన్ని చోట్ల లీకేజీ అవుతోంది. దీంతో ఆలయ౦లోకి వరద నీరు చేరుతుండటంతో, రెండు మోటార్ల ద్వారా బయటకు పంపుతున్నా రు. దీంతో కరకట్ట రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మట్టపల్లి ఆలయంపై ప్రత్యేక దృష్టిసారించి దేవాలయంలో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం, లీకేజీ రాకుండా మరో కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
