దిందా గ్రామంలో ఇంటి సీజ్ కు ఫారెస్ట్ అధికారుల యత్నం..అడ్డుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు

దిందా గ్రామంలో ఇంటి సీజ్ కు ఫారెస్ట్ అధికారుల యత్నం..అడ్డుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు

కాగ జ్ నగర్, వెలుగు: ఖర్జెల్లి ఫారెస్ట్ రేంజ్ లోని దిందా గ్రామంలో ఫారెస్ట్ అధికారులు డగే సురేశ్ నిర్మించిన ఇంటిని సీజ్ చేసేందుకు ఆదివారం వెళ్ళగా వాళ్ళను కుటుంబ సభ్యులు , స్థానికుల తో కలిసి అడ్డుకున్నారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హైమావతి తెలిపిన వివరాల ప్రకారం దిందా గ్రామానికి చెందిన డగే సురేశ్ రిజర్వ్ ఫారెస్ట్ బండేపల్లి బీట్ లోని కంపార్ట్మెంట్ 179 లో పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టాడు.

 గతంలో రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన వాటిని తీసుకోలేదు. అక్టోబర్ 18న మూడోసారి నోటీసు జారీచేసి అతని ఇంటి ముందు నోటీసులను ప్లెక్సీ రూపంలో అంటించారు.నోటీసులకు రిప్లై ఇవ్వకుండానే సోమవారం ఇంటి గృహ ప్రవేశం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివారం ఇల్లు సీజ్ చేసేందుకు వెళ్లగా అక్కడ ఇంటి యజమాని అందుబాటులో లేకపోగా అతని భార్య మంగ, వాళ్ళ బంధువులు, స్థానిక మహిళలు మూకుమ్మడిగా వీళ్లను అడ్డుకున్నారు. 

దీంతో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడ నుంచి తిరిగి వెళ్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హైమవతి పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఓ లు శ్రీనివాస రెడ్డి,రాజు, ఎఫ్ బీ ఓ లు మురళి,నవ్య,దినేష్,ఇమ్రాన్. తదితరులు ఉన్నారు.

 కాగా ఈ విషయంలో ఇంటి యజమాని సురేశ్ మాట్లాడుతూ తనపై ఫారెస్ట్ ఆఫీసర్లు కక్షతోనే ఇలా చేస్తున్నారనీ,అక్టోబర్ 18న ఇల్లు ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనని , ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు.ఇంతలోనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇంటిని సీజ్ చేస్తామని, ఇంట్లో పూజ చేసుకుంటున్న తన భార్య మంగ తోపాటు, కుటుంబ సభ్యులుతో ఫారెస్ట్ వాళ్లు వాగ్వాదానికి దిగారనీ ,తోపులాటలో తన తండ్రి చంద్రయ్య సొమ్మసిల్లి పడిపోయాడనీ చెప్పారు.