- ఎస్సారెస్పీకి 56513క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- గోదావరిలోకి 47059 క్యూసెక్కుల నీటి విడుదల
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి ఉత్పత్తి అయింది. ఈ ఏడాది 67 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా, ఇప్పటికే 67.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ఉత్పత్తి దాటింది. ప్రాజెక్టులోకి గడిచిన 100 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు అధికంగా వచ్చి చేరింది. స్థానిక జల విద్యుత్ కేంద్రంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 918.07 టీఎంసీల వరద వచ్చి చేరింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని జెన్ కో డీఈ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
కాకతీయ కాలువ, ఎస్కేప్ గేట్ల ద్వారా నిరంతరం నీటి విడుదల కొనసాగుతుండడంతో 4 టార్బాయిన్ల ద్వారా సామర్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ప్రస్తుతం 36.61 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఏడు యాసంగికి ఆయకట్టు పొలాలకు నీటి విడుదల చేపట్టనుండడంతో భవిష్యత్తులో మరింత విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి దాటడంతో జెన్ కో లో సంబురాలు నిర్వహించుకున్నారు.
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ గోదావరిలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 56513క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. వరద పెరగడంతో 16 గేట్ల ద్వారా గోదావరిలోకి 47059 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్కేప్ గేట్లకు 8000 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 231 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, ఆవిరిరూపంలో 573క్యూసెక్కుల నీరు వెళ్తోందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.
