
- ఏండ్ల తరబడి కబ్జాలో ఉన్న భూముల చెరవీడుతోంది
- బయటపడుతున్న కబ్జాదారుల బాగోతం
- నెల రోజుల్లో 25 మందిపై కేసులు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో కబ్జాదారులకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. లేని ప్లాట్లను ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించడం, అమాయకుల భూములను ఇతరు లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వారిని అరెస్ట్‌చేస్తున్నారు. నకిలీ పత్రాలతో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై గత నెల రోజులుగా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. నెల రోజుల్లో 25 మంది భూ కబ్జాదారులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూ బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు విచారణ చేస్తూ కబ్జదారులపై ఉక్కపాదం మోపుతున్నారు.
ఒకే ప్లాట్ ఇద్దరి పేరు మీద
ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న విలువైన భూముల ప్లాట్లపై కన్నేస్తున్న కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. సర్వే నంబర్లలో ప్లాట్లు లేకున్నా ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించి అమాయకులకు అమ్మేస్తున్నారు. ఒక్కో ప్లాట్‌ను ఇద్దరికి అమ్మడం, నకిలీ పత్రాలతో ప్లాట్లు కొనుగోలు చేసి వాటిని అమాయకులకు విక్రయిస్తున్నారు. తీరా విషయం తెలుసుకుంటున్న బాధితులు లబోదిబోమంటు
న్నారు. పోలీసులను ఆశ్రయిస్తుండడంతో కబ్జాదారుల బాగోతాలు బయటపడుతున్నాయి. వారిపై వరుస కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. రియల్ వ్యాపారులు, దళారులతో పాటు పలుకుబడి ఉన్న పలువురు రాజకీయ నేతల ప్రమేయంతో అమాయకుల భూములు కబ్జాకు గురైనట్లు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల కబ్జాదారులపై కేసులు..
- ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 68లో మూడు ప్లాట్ల సరిహద్దులను చెరిపేసి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని తులసి స్వామి అనే బాధితుడు జూన్ 23న ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆదినాథ్ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. తులసి స్వామికి 2007 సర్వే నంబర్ 68/59 లో రూ.83,500 నిందితుడు అమ్మగా అసలు అక్కడ ఆ ప్లాటే లేదని తేలింది. నిందితుడు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మి మోసం చేశాడు.
- ఓ మహిళ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా ప్రయత్నం చేసిన ఆరుగురిని జూన్ 18న - అదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గైదాని లతా వామన్ రావు అనే బాధితురాలికి సంబంధించి స్థలాన్ని 2020లో నకిలీ పత్రాలు సృష్టించి ఆమెను బెదిరించి ఆ స్థలం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా సయ్యద్ సాజిద్, సురేశ్, మోహన్, షేక్ వహీద్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 8 మందిపై కేసు నమోదైంది.
- కబ్జాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్‌ను జూన్ 17న మావల పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ సొసైటీలోని రెండు ప్లాట్లను కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయగా మరో నలుగురు షేక్ సమీ, సయ్యద్ ఇమ్రాన్, పర్వీన్ బేగం, షేక్ నూర్జహాన్పై కేసు నమోదు చేశారు.
- నకిలీ పత్రాలతో ఏకంగా వారసుడినే సృష్టించి 25 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఘటనలో తలమడుగు మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 1954లో ప్రభుత్వం అమీనుద్దీన్ అనే వ్యక్తికి కజ్జర్ల గ్రామంలో 25 ఎకరాల స్థలం కేటాయించింది. అయితే 2009లో బాధితుడికి వారసుడు లతీఫ్ పేరుతో డిపెండింగ్ సర్టిఫికెట్ తీసి 25 ఎకరాలు కాజేసిండు. ఇటీవల బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఎవ్వరినీ వదిలిపెట్టం
జిల్లాలో నకిలీ పత్రాలతో భూ కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ దందా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైన వదిలే ప్రసక్తే లేదు. భూమి కొనుగోలు చేసే సమయంలో అన్ని పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు సరిగా చూసుకోవాలి.
జీవన్ రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్