మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం

మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతున్నాయని గ్రామ సభలు నిర్వహించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తామని తీర్మానాలు చేశారు.  రాజంపేట మండలం శేర్ శంకర్​తండాలో 1100 జనాభా ఉంది. ఆమ్లెట్​ విలేజ్​మామిండ్ల తండా, జోగుల గుట్టతండాలో   కొన్నేండ్లుగా బెల్ట్​ షాపు సాగుతోంది. నిత్యం రూ.4 వేలకు పైగా మద్యం అమ్మకాలు జరిగేవి. పొద్దున నుంచి సాయంత్రం వరకు మద్యం ప్రియులు మత్తులోనే ఉండి పనులకు డుమ్మాకొట్టేవారు. రోడ్లపై తూలుతూ గొడవలు పెట్టుకోవడంతోపాటు ఇంట్లోకి వచ్చాక వీరంగం సృష్టించేవారు. 

గ్రామ పెద్దలు 15 రోజుల కింద మద్యాన్ని నిషేధించాలని, అమ్మితే రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించారు.  మద్యం కొరత ఏర్పడడంతో కొంత మార్పు వచ్చింది. మండల కేంద్రానికి వెళ్లి తెచ్చుకోలేక తాగడాన్ని తగ్గించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.  తండాలో మొదలైన ఈ ఆలోచన పక్క తండాలు, ఊర్లకు పాకింది.  ఇటీవల కామారెడ్డి జిల్లాలోని  5 ఊర్లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.  రాజంపేట మండలంలోని శేర్​శంకర్​ తండా,  కొండాపూర్​,  గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమితండాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైనా అమ్మితే రూ.లక్ష జరిమానా వేయాలని తీర్మానాలు చేశారు.    

ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు..

ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.  గ్రామాలు, తండాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  పచ్చని పల్లెల్లో మద్యం మత్తు చిచ్చుపెడుతోంది. ఊరోళ్లు ఏటా వేలం నిర్వహించి ఒకరికి ఇస్తుండడంతో వైన్స్​లో దొరికే రేట్ కంటే ప్రతి బాటిల్​పై ఇక్కడ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. 24 గంటల పాటు మద్యం దొరుకుతుండడంతో పలువురు మందుకు బానిసలవుతున్నారు. ఇంట్లో వారితో , ఇతరులతో గొడవ పడుతూ ఒళ్లు గుళ్ల చేసుకోవడంతోపాటు అప్పులపాలై ఆర్థిక చితికిపోతున్నారు.  ఒక్కో ఊరిలో రోజుకు సుమారు రూ. 2 వేల నుంచి రూ. 20వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండడం విశేషం. ఆయా గ్రామాల్లో ప్రజలు ఏకమై మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానాలు చేయడంతో బెల్ట్​షాపులు మూతపడ్డాయి.  

నిద్ర లేవంగనే మందు తాగేటోళ్లు..

మా ఊరిలో కొందరు నిద్ర లేవంగనే మందు తాగేటోళ్లు. ఒకరిని చూసి ఇంకొకరు మద్యానికి బానిసలయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లడం మానేసి రోడ్ల మీద గొడవలు పెట్టుకునేటోళ్లు. ఇండ్లలో రోజూ పంచాయితీలే  జరిగేవి.  తండాలో  మందు అమ్మకాలు చేయకుండా తీర్మానించాం.  15 రోజులుగా తండా ప్రశాంతంగా ఉంది. - సంతోష్, శేర్​శంకర్ తండా 

రోజుకు రూ. 110 మిగిలాయి..

నేను కొండాపూర్​కు పొద్దున వెళ్లి పాలు పోసి వచ్చేటప్పుడు రూ. 110 పెట్టి బాటిల్ తెచ్చుకొని తాగేది.   మందు అమ్మకపోవడం వల్ల ఆ డబ్బులు మిగులుతున్నాయి. మండల కేంద్రానికి వెళ్లి మందు తెచ్చుకునే ఓపిక లేదు.  తండాలో అందరం కలిసి మందు అమ్మొద్దని నిర్ణయం తీసుకున్నాం.   

దేవులా, శేర్​శంకర్​తండా