
- రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు
- మరో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
- రాష్ట్రంలో కవరైన లోటు.. సాధారణ వర్షపాతం నమోదు
- ఈ నెలలో 45 నుంచి 65 శాతం ఎక్కువ వర్షాలు పడే చాన్స్
- ఎగువన వర్షాలతో జూరాల, శ్రీశైలానికి పెరిగిన వరద
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ లోటులో ఉన్న వర్షపాతం కాస్తా.. ఈ రెండు మూడు రోజుల వర్షాలకు సాధారణ స్థాయికి చేరుకున్నది. మరో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. జూన్ నెల మొత్తం కరువు ఛాయలే కనిపించినా.. జులైలో మాత్రం మంచి వర్షాలే ఉంటాయని చల్లటి కబురు చెప్పింది. ఈ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడతాయని వర్షపాత అంచనాల్లో పేర్కొంది.
రాష్ట్రమంతటా వానలు..
మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం, బుధవారం భారీ వానలు కురిశాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. హైదరాబాద్ సిటీలోనూ మంగళవారం ఉదయం నుంచి మబ్బులు పట్టి మోస్తరు వర్షం కురిసింది. బుధవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గద్వాల జిల్లా అయిజలో 6.1, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూరులో 5.3, సిరికొండలో 4.1, కామారెడ్డి జిల్లా మేనూరులో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ ఆస్మాన్‌గఢ్‌లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదైంది.
లోటు పూడింది..
జూన్ నెలాఖరుకు రాష్ట్రంలో 41 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు కాగా.. ఈ రెండు రోజుల్లో కురిసిన వర్షానికి లోటు మొత్తం పూడింది. ఇప్పటివరకు 140 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 138 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జిల్లాలవారీగా చూస్తే.. సూర్యాపేట, సంగారెడ్డి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే లోటు వర్షపాతం ఉన్నది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సగటు కన్నా అధిక వర్షపాతం రికార్డ్ అయింది. మొత్తంగా 268 మండలాల్లో సాధారణ, 207 మండలాల్లో లోటు, 121 మండలాల్లో అధిక, 25 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వర్షాలు బాగానే కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటు(106 శాతం) కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తెలంగాణకు సంబంధించి సాధారణం కన్నా 45 నుంచి 65 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. అయితే, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురవచ్చని తెలిపింది.
కృష్ణా, గోదావరికి వరదలు..
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరికి వరదలు మొదలయ్యాయి. వరద వస్తుండడంతో మహారాష్ట్ర సర్కారు బాబ్లీ గేట్లను తెరిచింది. మరోవైపు కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో 15 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు136 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీల కెపాసిటీకి గాను 164.75 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. జూరాలకు 80 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 82,946 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 98,552 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం పవర్‌హౌజ్ ద్వారా 49,475 క్యూసెక్కులను దిగువకు వదులుతుండడంతో.. నాగార్జునసాగర్‌కూ వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం సాగర్‌కు 60,576 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగాను 143.86 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీరాంసాగర్‌కు 6,700 క్యూసెక్కుల వరద వస్తున్నది.