హైదరాబాద్ సిటీలో నల్లాలకు స్మార్ట్ మీటర్లు .. ఆటోమెటిక్గా బిల్లులు జారీ  

 హైదరాబాద్ సిటీలో నల్లాలకు స్మార్ట్ మీటర్లు .. ఆటోమెటిక్గా బిల్లులు జారీ  
  • అల్ట్రాసోనిక్​ జీఎస్ఎం టెక్నాలజీతో  పని చేయనున్న మీటర్లు 
  • నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు  
  • అందుకే అధికారుల స్పెషల్​ ఫోకస్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా నీటి బిల్లులు వసూలయ్యే ప్రాంతాలపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతమున్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులు నిర్ణయించారు. ఇవి ఆటోమేటిక్​గా బిల్లులు జనరేట్ చేస్తాయని, ట్యాంపరింగ్​ చేసే అవకాశం కూడా ఉండదంటున్నారు. దీంతో సరఫరా చేసిన నీటికి వందశాతం బిల్లులు వసూలు చేయవచ్చంటున్నారు. అన్ని ఏరియాలతో పోలిస్తే ఐటీ కారిడార్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్​రామ్​గూడ, మాదాపూర్, నార్సింగి, మియాపూర్, శేరిలింగం పల్లి వంటి ప్రాంతాల్లో బిల్లులు వందశాతం వసూలవుతున్నాయని, బోర్డుకు రూ.13.80 లక్షల కనెక్షన్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఒక్క ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు వసూలు అవుతున్నాయని అంటున్నారు.

అలాగే, ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయని, సింగిల్​విండో సెల్​కు కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తుల్లో అధికశాతం వెస్ట్​సిటీ నుంచే ఉంటున్నాయని చెప్తున్నారు. అందుకే స్పెషల్​ఫోకస్​పెట్టామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కనెక్షన్​చార్జీలతో పాటు, మీటర్​చార్జీలు కూడా తీసుకుంటున్నారు. 5 వేల కనెక్షన్లకు సంబంధించి మీటర్లకు అధికారులు ముందే డబ్బులు తీసుకున్నారు. 

అల్ట్రాసోనిక్​ జీఎస్ఎం టెక్నాలజీ

వెస్ట్​సిటీలోని ఆయా ప్రాంతాల్లో మల్టీస్టోరుడ్​బిల్డింగ్స్ (ఎంఎస్​బి) కమర్షియల్​కనెక్షన్లకు స్మార్ట్​మీటర్లను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఇవి అల్ట్రా సోనిక్ జీఎస్ఎం టెక్నాలజీతో పని చేస్తాయి. వీటి కోసం పలు కంపెనీల నుంచి ఎక్స్​ప్రెషన్​ఆఫ్​ఇంట్రెస్ట్​(ఈఓఐ) కోసం టెండర్లను ఆహ్వానించారు. మొదటి విడతగా 6 వేల మీటర్లను కొనాలనుకుంటున్నారు. ఈ మీటర్లను సరఫరా చేసే సంస్థలు వాటిని బిగించడంతో పాటు, నిర్ణీత కాల పరిమితి వరకూ బిల్లింగ్​రెయిజ్​చేయడం, మీటర్ల మెయింటెనెన్స్​ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలనెలా బిల్లులను మాన్యువల్​గా అందజేస్తుండగా, స్మార్ట్​మీటర్లు పెట్టాక హెడ్డాఫీసు లోని డాష్ బోర్డు నుంచి రీడింగ్​చూసి నేరుగా బిల్లులను జనరేట్​చేయొచ్చు. 

ఏఎంఆర్​ మీటర్లలో అవకతవకలతో..

ఇప్పటి వరకూ గ్రేటర్​పరిధిలో ఆటోమేటిక్​మీటర్ రీడింగ్​(ఎఎంఆర్) మీటర్లను పూర్తి స్థాయిలో బిగించాలని అనుకున్నా సక్సెస్​కాలేకపోయారు. కొందరు అధికారులు మీటర్లు సరఫరా చేసే సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. టాంపరింగ్​చేయడం, మీటర్ల కొనుగోలు, మెయింటెనెన్స్​లో వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో ఆయా కంపెనీలకు ఉన్నతాధికారులు నోటీసులిచ్చారు. బిల్లుల వసూళ్లలో తేడా వస్తుండడంతో ఎఎంఆర్ మీటర్లపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే వెస్ట్​సిటీలో స్మార్ట్​మీటర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన చేశారు. రాబోయే కాలంలో ఔటర్ రింగ్​రోడ్​ అవతల కూడా నీటి సరఫరా చేసేందుకు ప్రపోజల్స్​వస్తుండడంతో ఈ కొత్త మీటర్లను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.