స్టూడెంట్స్కు ట్రంప్ మరోసారి షాక్.. వీసాలు దొరకడం మరింత కఠినతరం!

స్టూడెంట్స్కు ట్రంప్ మరోసారి షాక్.. వీసాలు దొరకడం మరింత కఠినతరం!
  • స్టూడెంట్ వీసాకు మరో షరతు
  • షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ సర్కారు 

వాషింగ్టన్: అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులు నిరసనలు చేపట్టడంపై ట్రంప్ సర్కార్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే అమెరికాకు వచ్చే విద్యార్థుల వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను కఠినంగా మార్చింది. ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్ ను అమలు చేస్తోన్న అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ విద్యార్థులకు ఉన్న వీసా గడువు కాలాన్ని తగ్గించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. 

దీంతో పాటు ఎక్స్ఛేంజ్ సందర్శకులు, విదేశీ సమాచార మీడియా ప్రతినిధుల బసకు అనుమతించే కాలాన్ని తగ్గించాలని అమెరికా అధికారులు ప్రతిపాదించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్అండ్ బడ్జెట్ విభాగానికి అందించారు. ఈ ప్రతిపాదనలను అధికారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి నేరుగా రిపోర్ట్ చేస్తారని సమాచారం. 

అమెరికా సర్కారు దీనిని అమల్లోకి తీసుకొస్తే ఇప్పటికే ఉన్న వీసా కష్టాలు ఇంకింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థులతో పాటు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను అందించాలని, సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని నిబంధన పెట్టింది. సోషల్ మీడియా ఖాతాలు దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా వీసా పొందలేరని, అనర్హులుగా మారతారని హెచ్చరించింది.