మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డేదీ?

మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డేదీ?

హైదరాబాద్‌‌‌‌, వెలుగుసర్కారు దవాఖానాల్లోని డాక్టర్లు‌‌‌‌, నర్సులు, ఫార్మసిస్టులు తదితర నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు తలపెట్టిన ‘మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎంహెచ్ఆర్​బీ)’ ఏర్పాటు ముందుకు పడటం లేదు. దీనిపై గతేడాది సెప్టెంబర్​లోనే జీవో జారీ చేశారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా అది అమల్లోకి రాలేదు. మరోవైపు దవాఖానాల్లో ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. ఇప్పటికైనా బోర్డును ఉనికిలోకి తెచ్చి, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డాక్టర్ల యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

అవినీతికి చెక్​ పెట్టేందుకు..

తొలుత వైద్యారోగ్యశాఖలో ఏ విభాగానికి అవసరమైన సిబ్బందిని ఆ విభాగమే భర్తీ చేసుకునేది. 2013లో జరిగిన ఓ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భారీగా అవినీతి జరిగినట్టు తేలింది. దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మెడికల్​ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (టీఎస్‌‌‌‌పీఎస్సీ)కు అప్పగించారు. 2017లో టీఎస్‌‌‌‌పీఎస్సీ ద్వారా సుమారు 500 డాక్టర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు, 3,300 స్టాఫ్‌‌‌‌ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్‌‌‌‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చారు. ఇప్పటివరకూ ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. చివరికి టీఎస్‌‌‌‌పీఎస్సీతో లాభం లేదని భావించి గతేడాది ప్రైమరీ హెల్త్​ సెంటర్ల (పీహెచ్​సీ)లోని 520 డాక్టర్‌‌‌‌‌‌‌‌ పోస్టులను డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్ పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌ విభాగం అధికారులే భర్తీ చేశారు. అయితే ఈ నియామకాల్లోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ప్రమోషన్లలో జాప్యం, పైరవీలు చేసుకున్నవారికే ప్రమోషన్లు ఇచ్చారన్న ఆరోపణలతో.. ప్రత్యేకంగా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు ఏర్పాటు చేయాలని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డిమాండ్‌‌‌‌ చేశారు. దాంతో మెడికల్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో సర్కారు జీవో జారీ చేసింది. బోర్డు చైర్మన్‌‌‌‌గా వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రెటరీ, స్పెషల్‌‌‌‌ గ్రేడ్‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీగా, జాయింట్‌‌‌‌ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యుడిగా ఉంటారని అందులో పేర్కొంది. బోర్డులో డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, లీగల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ నుంచి జూనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ వరకూ అందరినీ డిప్యుటేషన్‌‌‌‌పై ఇతర శాఖల నుంచి తీసుకోవాలని సూచించింది. కానీ బోర్డుకు ఓ ఆఫీసంటూ కేటాయించలేదు, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.

తమిళనాడు తరహాలో..

ఇటీవల డాక్టర్లతో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ భేటీలోనూ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డుపై చర్చించారు. బోర్డు ఏర్పాటులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నారు. తమిళనాడులో మెడికల్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు ఉంది. ఆ బోర్డుకు రక్షణగా ‘సెల్ఫ్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌ రిసోర్సెస్‌‌‌‌’ చట్టం ఉంది. మన దగ్గరబోర్డుకు స్వతంత్ర హోదా అయినా ఇస్తే కోర్టు కేసుల ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అధికారులు అధ్యయనాల పేరిట జాప్యం చేస్తున్నారని, వెంటనే బోర్డును ఏర్పాటు చేసి, నియామకాలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.