హైకోర్టుకు ఉద్యాన వర్సిటీ భూములను కేటాయించొద్దు: హైకోర్టు పరిరక్షణ సమితి

హైకోర్టుకు ఉద్యాన వర్సిటీ భూములను కేటాయించొద్దు: హైకోర్టు పరిరక్షణ సమితి

హైదరాబాద్:  వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని.. వెంటనే జీవో నెంబర్ 55ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెసర్ గాలి వినోద్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, న్యాయవాది మండల సభ్యులు ఫణీంద్ర భార్గవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా.. ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టకుండా హైకోర్టు భవనాన్ని రాజేంద్రనగర్ తరలిస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పు పట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల్లో హైకోర్టు భవనాన్ని నిర్మిస్తే.. బయోడైవర్సిటీ పార్కులో ఉన్న జీవవైవిద్యం కోల్పోతామని అన్నారు. అక్కడ దాదాపు రెండు లక్షలకు పైగా వృక్షాలు తొలగించడం వల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

ఈ యూనివర్సిటీని డిస్టర్బ్ చేస్తే పరిశోధనలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని.. వ్యవసాయ రంగానికి సరైన దిశా నిర్దేశం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కావున వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా హైకోర్టు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.