గవర్నర్​పై సర్కార్ పిటిషన్.. విచారణ 10కి వాయిదా

గవర్నర్​పై సర్కార్ పిటిషన్.. విచారణ 10కి వాయిదా

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్​లో పెట్టారని, దీనిపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరోసారి వాయిదా పడింది. దీనిపై స్పందించేందుకు మరికొంత టైమ్ కావాలని కేంద్రం కోరడంతో సుప్రీంకోర్టు కేసు విచారణను ఏప్రిల్​10వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్​ పీఎస్​ నర్సింహా, జస్టిస్ ​జేబీ పార్థీవాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది.

గవర్నర్ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్ ​మెహత, తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత్​దవే వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్​ఆమోదించిన బిల్లులను 2022 సెప్టెంబర్​లో గవర్నర్​ ఆమోదం కోసం పంపారని, అప్పటి నుంచి గవర్నర్​ వాటిని ఆమోదించకుండా పెండింగ్​లో ఉంచారని దవే వివరించారు. మధ్యప్రదేశ్​అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అక్కడి గవర్నర్ ఏడు రోజుల్లో, గుజరాత్​అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నెల రోజుల్లో ఆ రాష్ట్ర గవర్నర్​ ఆమోదించారని తెలిపారు. కానీ తెలంగాణ గవర్నర్ మాత్రం నెలల తరబడి బిల్లులను ఆమోదించకుండా తనవద్దే పెట్టుకున్నారని తెలిపారు. గవర్నర్​ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని, ఈ విషయంలో సొలిసిటర్​జనరల్ జోక్యం చేసుకోవాలని, గవర్నర్​కు సలహాలు ఇవ్వాలని చెప్పారు.

ధర్మాసనం జోక్యం చేసుకొని బిల్లుల ఆమోదంపై గవర్నర్​తో చర్చించారా అని సొలిసిటర్ జనరల్​ను ప్రశ్నించింది. తుషార్​మెహత స్పందిస్తూ పెండింగ్​ బిల్లుల అంశంపై ఇప్పటికే తాను తెలంగాణ గవర్నర్​తో చర్చించానని తెలిపారు. గవర్నర్ తో చర్చించిన అంశాలపై ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేనన్నారు. ఈ నెల 20న ఇదే పిటిషన్​పై విచారించిన ధర్మాసనం తాము గవర్నర్​ కు నోటీసులు జారీ చేయలేమని, పెండింగ్​ బిల్లులపై కౌంటర్ ​దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్​పై కేంద్రం స్పందించేందుకు మరికొంత సమయం కావాలని అడ్వొకేట్​లు కోరడంతో తదుపరి విచారణను ఏప్రిల్​10వ తేదీకి వాయిదా వేశారు.