బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు తగ్గిన కేటాయింపులు

బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు తగ్గిన కేటాయింపులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,697 కోట్ల నిధులు కేటాయించారు. నిరుడు రూ.5,522 కోట్లు మాత్రమే అలకేట్‌‌ చేయగా ఈసారి రూ.175 కోట్లు అదనంగా పెట్టారు. పోయినేడాది బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు కేటాయించగా, అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. లోన్ల కోసం యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందించినా సర్కారు అప్రూవ్ చేయలేదు. కుల వృత్తులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ సారి కూడా బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చెరో 300 కోట్ల చొప్పున 600 కోట్లు అలకేట్‌‌ చేశారు. గత నాలుగేండ్లుగా బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఈ సారి వడ్డెర ఫెడరేషన్‌‌, క్రిష్ణబలిజ, మేదర కార్పొరేషన్లు, విశ్వబ్రాహ్మణ, కమ్మరి కార్పొరేషన్లకు రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. వాల్మీకి బోయకు రూ. 2.5 కోట్లు, భట్రాజు, సగరకు రూ. 2 కోట్లు అలకేట్‌‌ చేశారు. కల్యాణలక్ష్మికి రూ. 1850 కోట్లు, నేత కార్మికులకు రూ. 400 కోట్లు, హాస్టళ్లకు రూ. 150 కోట్లు, గీత కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు పెట్టారు. ఇక ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు రూ. 90 కోట్లు ప్రతిపాదించగా, బీసీ స్టడీ సర్కిల్‌‌కు రూ. 25 కోట్లు కేటాయించారు. 

బీసీ పాలసీ ముచ్చటే లేదు..
రాష్ట్రంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తీసుకొస్తామన్న బీసీ పాలసీ ముచ్చటే లేకుండా పోయింది. 2017 డిసెంబర్‌‌లో గొప్పలు చెబుతూ అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల ఎజెండా బుట్టదాఖలైంది. చర్చలు, సమావేశాలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించిన 210 తీర్మానాలు అటకెక్కాయి. నాలుగేండ్లవుతున్నా ఈ తీర్మానాల అమలు ముందట పడతలేదు. ఈ సారి బడ్జెట్‌‌లోనైనా పాలసీలో అంశాలను కనీసం ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ మాదిరిగా బీసీ సబ్‌‌‌‌ప్లాన్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఎప్పటిలాగే బడ్జెట్‌‌లో నిరాశే ఎదురైంది. 

మైనార్టీలకు రూ. 1728 కోట్లు..
బడ్జెట్‌‌లో మైనార్టీ సంక్షేమానికి స్వల్పంగా నిధులు పెంచారు. ఈ సారి రూ.1728 కోట్లు కేటాయించారు. నిరుడు మైనార్టీలకు రూ.1606 కోట్లు పెట్టారు. అంటే ఈసారి రూ. 122 కోట్ల నిధులు పెరిగాయి. షాదీముబారక్‌‌కు రూ. 300 కోట్లు, వక్ఫ్‌‌ బోర్డుకు రూ.66 కోట్లు, క్రిస్టియన్‌‌ మైనార్టీ కార్పొరేషన్‌‌కు రూ. 2.5 కోట్లు.. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ. 49,658 కోట్లు పెట్టారు. నిరుడు రూ.36,310 కోట్లు అలకేట్‌‌ చేశారు.

బీసీబంధు స్కీం ఏది?
బడ్జెట్‌‌లో బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లే పెట్టారు. ఇది 52 శాతం జనాభా బీసీల అభివృద్ధికి ఏ మాత్రం సరిపోదు. కొత్త స్కీములు, కొత్త పథకాలు ప్రకటించలేదు. కొనసాగుతున్న పథకానికే బడ్జెట్ కేటాయించారు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్లలో 5. 37 లక్షల మంది దరఖాస్తుదారులు రుణాల కోసం 4 ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. వీటికి రూ.10 వేల కోట్లు కావాలి.  కానీ బడ్జెట్​లో కేటాయింపుల్లేవు.
- ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షుడు