కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పార్లమెంట్ భద్రత సీఐఎస్ఎఫ్ చేతికి

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..  పార్లమెంట్ భద్రత సీఐఎస్ఎఫ్ చేతికి

పార్లమెంట్‌‌పై స్మోక్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బిల్డింగ్‌‌ కాంప్లెక్స్‌‌ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌‌(సీఐఎస్‌‌ఎఫ్‌‌)కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ముందుగా పార్లమెంట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌‌లో సర్వే చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. సర్వే తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్‌‌లో సీఐఎస్‌‌ఎఫ్‌‌ సిబ్బందిని మోహరించనున్నట్లు చెప్పాయి. 

సీఐఎస్‌‌ఎఫ్‌‌కు చెందిన గవర్నమెంట్‌‌ బిల్డింగ్‌‌ సెక్యూరిటీ (జీబీఎస్) యూనిట్‌‌ నిపుణులు, ఫైర్‌‌ యూనిట్‌‌ సభ్యులు.. పార్లమెంట్‌‌ భద్రతా బృందాలతో కలిసి ఒకట్రెండు రోజుల్లో సర్వే చేపట్టనున్నారు. ‘‘సర్వే తర్వాత పాత, కొత్త పార్లమెంట్‌‌ కాంప్లెక్స్‌‌లను సీఐఎస్‌‌ఎఫ్‌‌ అధీనంలోకి తీసుకోనుంది. ప్రస్తుత  పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌‌ (పీఎస్ఎస్), ఢిల్లీ పోలీసు, సీఆర్పీఎఫ్‌‌కు చెందిన పార్లమెంట్‌‌ డ్యూటీ గ్రూప్‌‌ (పీడీజీ) టీమ్స్.. సీఐఎస్‌‌ఎఫ్‌‌ కిందే పనిచేయనున్నాయి” అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

నిందితుల కస్టడీ పొడిగింపు

స్మోక్ అటాక్ కేసులో నలుగురు నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలమ్ దేవిల పోలీసు కస్టడీని జనవరి 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని స్పెషల్ జడ్జి హర్దీప్ కౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజులు కస్టడీ పొడిగించాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. అందులో ఒకరు కర్నాటకకు చెందిన సాయికృష్ణ జాగలి (మనోరంజన్ క్లోజ్ ఫ్రెండ్) కాగా, మరో వ్యక్తిది యూపీ అని పోలీసు వర్గాలు తెలిపాయి. సాయికృష్ణ ఐటీ ఎంప్లాయ్‌‌ అని, రిటైర్డ్ డీఎస్పీ కొడుకు అని వెల్లడించాయి. బాగల్‌‌కోట్‌‌లోని విద్యాగిరి నుంచి అతడిని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చినట్లు చెప్పాయి.