మిగతా ఉద్యోగాల సంగతేంది?

మిగతా ఉద్యోగాల సంగతేంది?
  • నోటిఫికేషన్లు ఇచ్చింది 17,117 ఉద్యోగాలకే
  • నాన్చుడు ధోరణితో కాలం వెల్లదీస్తున్న సర్కార్
  • గ్రూప్‌1, పోలీసు తప్ప మిగిలిన పోస్టులపై నో క్లారిటీ
  • ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన పోస్టులకూ నోటిఫికేషన్లు ఇస్తలే

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర సర్కారు నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. 80 వేల ఉద్యోగాలను రిక్రూట్ చేసేందుకు వెంటనే నోటిఫై చేస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలు అవుతున్నా అడుగు ముందుకు పడటం లేదు. పోస్టులకు ఫైనాన్స్ పర్మిషన్లు, నోటిఫికేషన్లు ఇవ్వడంలో సర్కారు జాప్యం చేస్తున్నది. ఇప్పటిదాకా 35,220 ఉద్యోగాల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్‌‌మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో పోలీసు డిపార్ట్‌‌మెంట్‌‌తోపాటు గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. ఇటీవల మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్​మెంట్ డిపార్ట్‌‌మెంట్లలో మరో 1,433 పోస్టుల భర్తీకి పర్మిషన్ వచ్చింది. అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు అప్లై చేసుకునే గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పోస్టులపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి నామమాత్రపు కసరత్తు చేసి వదిలేశారు. ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చాలా సమయం తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పోస్టులను భర్తీ చేసే రిక్రూట్‌‌మెంట్ బోర్డుల్లోనే ఖాళీలు దర్శనమిస్తున్నాయి. దీంతోనే నోటిఫికేషన్లు మరింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

క్లియరెన్స్ ఎప్పుడిస్తరో

గ్రూప్ 4 ఉద్యోగాలపై లెక్కలు ఇవ్వాలని సీఎస్ గత నెల 29 దాకా డెడ్ లైన్ పెట్టారు. అయినా ఇప్పటికీ అన్ని డిపార్ట్‌‌మెంట్ల నుంచి గ్రూప్ 4 పోస్టుల ఖాళీలపై స్పష్టత రావడం లేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఖాళీల లెక్కల ప్రకారం ఈ సంఖ్య 9,168గా ఉంది. ఇది కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 3 నెలలుగా కసరత్తు చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది అప్లై చేసుకునే గ్రూప్ 4 పోస్టులకు పూర్తి స్థాయిలో అప్రూవల్ ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల ఊసే ఎత్తడం లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన తర్వాత గ్రూప్ 2కు ఎగ్జామ్ ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి నుంచి ఖాళీలు, రోస్టర్ పాయింట్లపై కసరత్తు చేస్తే కానీ ఆ ఫైల్ అప్పటికి పూర్తి కాదని ఆఫీసర్లు అంటున్నారు. మరోవైపు హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో మొత్తం 12,775 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సీఎంతోపాటు మంత్రి హరీశ్​రావు పలుమార్లు ప్రకటించారు. అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. అయితే ఇంతవరకు ఫైనాన్స్​ అప్రూవల్ మాత్రం ఇవ్వలేదు.

ప్రాసెస్ కూడా మొదలుపెట్టలే

ఉద్యోగాల భర్తీలో ఫైనాన్స్ క్లియరెన్స్ తప్పనిసరి. ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే రిక్రూట్‌‌మెంట్ బోర్డులు నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇప్పటి వరకు 35,220 పోస్టులకు అనుమతులు ఇస్తే.. ఇందులో రెండు నోటిఫికేషన్లు మాత్రమే జారీ చేశారు. గ్రూప్ 1లో 503 పోస్టులకు టీఎస్​పీఎస్సీ, పోలీసు రిక్రూట్​మెంట్ బోర్డులో 16,614 పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. మిగిలిన 18,103 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. వీటికి మరింత టైం తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ‌‌లో 2,662 పోస్టులతో పాటు మ‌‌రికొన్ని శాఖ‌‌ల‌‌కు చెందిన పోస్టులు ఉన్నాయి. ఫైర్ సర్వీసు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్‌‌మెంట్​ బోర్డులు ఇంకా ప్రాసెస్ కూడా మొదలుపెట్టలేదని 
తెలిసింది.

రిక్రూట్‌మెంట్ బోర్డుల్లోనే ఖాళీలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనే భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన టైమ్‌లో ఏపీపీఎస్సీ నుంచి 128 మంది తెలంగాణ కేడర్ ఉద్యోగులు టీఎస్‌పీఎస్సీకి అలాట్ అయ్యారు. వీరిలో 40 మంది అటెండర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితర నాలుగో తరగతి ఉద్యోగులే ఉన్నారు. ప్రస్తుతం టీఎస్​పీఎస్సీలో 79 మంది మిగిలారు. సుమారు 24 హెచ్​వోడీ పోస్టులు, 70 వరకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డులో 50కి పైగా ఖాళీలు, తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డులో 28, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 42 ఖాళీలు ఉన్నట్లు తెలిసింది.