- ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తో హాజరుపై పక్కా నిఘా
- స్టేట్ ఆఫీస్ నుంచి జిల్లాలకు ప్రతి నెలా లిస్ట్
- గత రెండేండ్లలో50 మంది టీచర్లు డిస్మిస్
హైదరాబాద్, వెలుగు: బడి బాట పట్టని పంతుళ్లకు విద్యా శాఖ షాక్ ఇవ్వబోతోంది. సెలవు పెట్టకుండా ఇష్టారాజ్యంగా నెలల తరబడి స్కూళ్లకు డుమ్మా కొడుతున్న టీచర్లపై కొరడా ఝుళిపించబోతోంది. రెగ్యులర్గా 30 రోజులు స్కూల్‌కు రాకపోతే షోకాజ్ నోటీసులను ఇంటికి పంపిస్తుంది.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో ఎప్పటికప్పుడు హాజరుపై ఆరా తీస్తూ.. దీర్ఘకాలికంగా విధులకు దూరంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రెడీ చేసింది. రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల మంది సర్కారు స్కూల్ టీచర్లు ఉన్నారు. వీరికి ఇటీవల ఎఫ్ఆర్ఎస్ విధానం మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు టీచర్లు బడులకు డుమ్మాలు కొడుతున్నారు. నెలల తరబడి రాకపోవడంతో ఆయా బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అయితే, ఇక టీచర్లు ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా 30 రోజులు వరుసగా స్కూల్‌కు రాకపోతే వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నిర్ణయించింది. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో డైరెక్టర్ నవీన్ నికోలస్ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ నోటీసులకు సంబంధిత టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
సరైన కారణం లేకుండా విధులకు డుమ్మా కొట్టినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో అటెండెన్స్ ను రిజిస్టర్ల ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. దీంతో హెడ్మాస్టర్, ఎంఈఓ, డీఈఓ.. అంటూ సమాచారం సేకరించాల్సి వచ్చేంది. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ విధానంతో ఎవరెవరు రెగ్యులర్ గా రావడం లేదనేది ఈజీగా గుర్తించే అవకాశం ఏర్పడింది.
స్టేట్ ఆఫీస్ నుంచి మానిటరింగ్
రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంతో బడుల్లో టీచర్ల హాజరు పెరిగింది.ఈ విధానంతో ఎక్కడెక్కడ ఎవరు స్కూల్‌కు రావట్లేదో క్షణాల్లో తెలిసిపోతోంది. డుమ్మా కొడుతున్న టీచర్ల డేటాను.. స్టేట్ ఆఫీసు నుంచే అధికారులు ప్రతినెలా క్రోడీకరించి ఆయా జిల్లాల డీఈఓలకు పంపిస్తున్నారు.
డుమ్మా కొట్టిన టీచర్లకు ఆ లిస్ట్ ఆధారంగా డీఈఓలు నోటీసులు జారీ చేయనున్నారు. కాగా, గత రెండేండ్లలో ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని దాదాపు 50 మంది టీచర్లను విద్యాశాఖ సర్వీసు నుంచి తొలగించింది. భవిష్యత్తులోనూ ఇదే తీరు కొనసాగుతుందని, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
