ఉపాధ్యాయుల అటెండెన్స్పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఉపాధ్యాయుల అటెండెన్స్పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు ప్రభుత్వ బడుల్లో బయో అటెండెన్స్ ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మొబైల్ యాప్ ద్వారా బయో అటెండెన్స్ నమోదుకు అనుమతి ఇచ్చింది. 

ప్రభుత్వ స్కూళ్లలో బయోమెట్రిక్ 

రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ స్కూళ్లల్లో బయోమెట్రిక్ హాజరు ఉంది. దీని ద్వారా టీచర్లు, సిబ్బంది అటెండెన్స్ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల.. ఇలా మొత్తం 20 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం బయో మెట్రిక్ హాజరు లేదు. దీని స్థానంలో జియో అటెండెన్స్ అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. విధులకు హాజరైనప్పుడు సెల్ఫీ ఫోటో తీయగానే టీచర్లు లేదా సిబ్బందిని ముందుగా గుర్తించి, లొకేషన్ ఆధారంగా వారు ఎక్కడున్నారో తెలిపే విధంగా విద్యాశాఖ అధికారులు యాప్ తయారు చేశామన్నారు.

జియో అటెండెన్స్

జియో అటెండెన్స్ అమలుపై పాఠశాల విద్యాశాఖ పలు సూచనలు చేసింది. జియో అటెండెన్స్ ఏ రకంగా అమలు అవుతుందో కూడా తెలిపింది. టీచర్లు స్కూలుకు హాజరైనప్పుడు.. విధులు ముగించుకొని వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా ఫోటో తీయాలి. ఒకవేళ ఏదైనా సమస్యతో మొబైల్ లో ఇంటర్నెట్ పని చేయకపోయినా ఆఫ్ లైన్ లో ఉన్నా వివరాలు నమోదవుతాయని, ఇంటర్నెట్ పని చేసిన తర్వాత యాప్ లో రికార్డ్ అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కేవలం అటెండెన్స్ మాత్రమే కాదు... లీవ్ శాంక్షన్ అయిందో, లేదో తెలుసుకోవచ్చని చెప్పారు. అన్ డ్యూటీలో భాగంగా వేరే స్కూల్ కు వెళ్తే అక్కడి నుంచి కూడా అటెండెన్స్ నమోదు చేయొచ్చని తెలిపారు. 

ఉపాధ్యాయ సంఘాల నేతలు ఫైర్

మరోవైపు జియో అటెండెన్స్ పై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి సూపర్ వైజర్స్,. అబ్సర్ వర్ పోస్టులను రాష్ట్రం ప్రభుత్వం భర్తీ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు. కేవలం ఒక కార్పొరేట్ కంపెనీకి లాభం వచ్చేలా యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని చూస్తోందన్నారు. ఉపాధ్యాయ వృత్తిని అవమానపరిచే విధంగా ఉన్న జియో అటెండెన్స్ ను తీసి వేయాలని టీచర్ల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సమస్యలు పరిష్కరించకుండా.. కొత్త సమస్యలు తీసుకొస్తోందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో పెద్త ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.