తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం: ఉత్తమ్

తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం గాంధీభవన్ లో మీడియాతో ఉత్తమ్ చిట్ చాట్ చేశారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.

 ‘‘పోయినసారి కంటే ఈసారి ఎక్కువ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశాం. సెంటర్లలో ఎలాంటి లోపాలు లేవు. కొనుగోళ్లలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదు. రాష్ట్రమంతటా ఒకేసారి వరి కోతలు జరగవు. అయినా మేం ఒకేసారి రాష్ట్రమంతటా కొనుగోలు సెంటర్లు ప్రారంభించాం. పోయినేడాది ఇదే నెలలో అప్పటి ప్రభుత్వం 13.77 మిలియన్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.  కానీ మేం 24.85 మిలియన్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం” అని వెల్లడించారు. 

రైతులు ఏ విధంగా పంట నష్టపోయినా పరిహారం అందిస్తామని, పిడుగుపడి చనిపోయినోళ్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేస్తామని చెప్పారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రైతుభరోసాను అడ్డుకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పోలింగ్ బూత్ లో జనం ఓటు వేస్తున్న టైమ్ లో రైతుబంధు వాళ్ల ఖాతాలో పడింది. మరి అప్పుడు బీజేపీ వాళ్లు ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

2019లోనే కాళేశ్వరం డ్యామేజీ..  

కాళేశ్వరం బ్యారేజీ 2019లోనే డ్యామేజీ అయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ) అధికారులు తేల్చారని ఉత్తమ్ తెలిపారు. ‘‘అప్పుడే బ్యారేజీలోని నీళ్లు ఖాళీ చేసి మరమ్మతులు చేసి ఉంటే బాగుండేదని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పుడు బ్యారేజీలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై వాళ్లు గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ పూర్తిస్థాయి నివేదిక మరో వారం రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత  పూర్తి వివరాలు తెలుస్తాయి. బ్యారేజీ సామర్థ్యానికి సంబంధించిన అన్ని టెస్టులు చేస్తున్నారు” అని చెప్పారు. రాష్ట్ర తాగు నీటి అవసరాల కోసం కర్నాటక సర్కార్ 2.25 టీఎంసీల నీళ్లు ఇస్తోందన్నారు.  

బీజేపీకి 200లోపే సీట్లు.. 

అదానీ, అంబానీ కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ‘‘బీజేపీకి ఈసారి 200 సీట్లు రావడం కూడా కష్టమే. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు.  ఎంపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. ప్రజల్లో కాంగ్రెస్ కు మంచి సానుకూలత ఉంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకే వస్తాయి. దేశంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే సీట్లలో నల్గొండ ఉంటుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. జూన్ 9న ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గత పదేండ్లలో బీజేపీ అప్రజాస్వామిక పాలన సాగించింది. కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం మూతపడుతుందని మోదీ చెప్పడం దారుణం. ప్రధాని హోదాలో అసత్య ఆరోపణలు చేయడం దేశానికి, ప్రజలకు మంచిది కాదు” అని అన్నారు.