రేపే ఎమ్మెల్సీ బై పోలింగ్.. బరిలో 52 మంది అభ్యర్థులు

రేపే ఎమ్మెల్సీ బై  పోలింగ్.. బరిలో 52 మంది అభ్యర్థులు
  • ముగిసిన వరంగల్​-నల్గొండ- ఖమ్మం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బైపోల్​ ప్రచారం
  • బరిలో 52 మంది అభ్యర్థులు.. కాంగ్రెస్​ అభ్యర్థిగా తీన్మార్​ మల్లన్న
  • బీజేపీ నుంచి ప్రేమేందర్​రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి రాకేశ్​రెడ్డి
  • 4,63,839 మంది ఓటర్లు.. 605 పోలింగ్​ సెంటర్లు

హైదరాబాద్/నల్గొండ/వరంగల్​, వెలుగు :  హోరాహోరీగా సాగిన  వరంగల్‌‌-– నల్గొండ– ఖమ్మం- గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ  బై ఎలక్షన్​ ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్​ ప్రక్రియ జరగనుంది. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్​ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరంగల్​, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఇందులో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్  జిల్లాలో 1,73,406 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ బై పోల్​ ఫలితాలు జూన్​ 5న విడుదల కానున్నాయి. ఎమ్మెల్సీ బై ఎలక్షన్​ సందర్భంగా  ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో 48 గంటలపాటు అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్​ మూసివేయనున్నారు. పోలింగ్ డే 27వ తేదీన ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని..  ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

పోటాపోటీగా ప్రచారం చేసిన పార్టీలు

కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి బరిలో  ఉన్నారు.  పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రాధాన్యత ఓట్లపై పార్టీలు, అభ్యర్థులు దృష్టి సారించారు. తీన్మార్​ మల్లన్న కోసం మంత్రులు కూడా విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున 12 జిల్లాల పరిధిలో పట్టభద్రుల సమావేశాలు నిర్వహించి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. సిట్టింగ్​ స్థానం కావడంతో బీఆర్‌‌ఎస్‌‌కు ప్రెస్టేజీగా మారింది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. కోచింగ్ సెంటర్​ నిర్వాహకుడిగా నిరుద్యోగులకు సుపరిచితుడైన పాలకూరి అశోక్ కుమార్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన బక్క జడ్సన్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.