ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి.  మే 27వ తేదీ మంగళవారం జరిగే  పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ రోజు ఉదయం6 నుండి సాయంత్రం 8 వరకు144 సెక్షన్ అమలు ఉంటుంది. ఇక మూడు జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.  

ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో  52 మంది బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మే 25వ తేదీ శనివారం ప్రచారానికి చివరిరోజు కావడంతో అభ్యర్థులు.. మీడియా సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల తరుపున పలువురు కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. 

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డ కి మద్దతుగా కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ స్థానికి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరుపున కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించారు. 

కాగా, మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోన 34 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా..  ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.