కామేపల్లి, వెలుగు : రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెప్పారు. మంగళవారం మండలంలోని కొత్త లింగాల,ముచ్చర్ల గ్రామాల్లో కామేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న రైతులందరికీ సరైన గిట్టుబాటు ధర ఇవ్వటంతో పాటు బోనస్ చెల్లించి లాభం చేకూర్చే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ రాంబాబు, తహసీల్దార్ సుధాకర్ పాల్గొన్నారు.
