ట్రైనింగ్​ ఇయ్యలే.. శాలరీ ఇస్తలే..జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

ట్రైనింగ్​ ఇయ్యలే.. శాలరీ ఇస్తలే..జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

డ్యూటీలో చేరి రెండు నెలలు దాటినా తప్పని ఇబ్బందులు

కఠిన నిబంధనలతో టెన్షన్

 ఎక్కడ సంతకం పెడితే
ఏ సమస్య వస్తుందోనన్న భయం

కొత్తగా సెలక్ట్‌‌‌‌ అయిన జూనియర్‌‌‌‌ పంచాయతీ కార్యదర్శికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ మేజర్‌‌‌‌ గ్రామపంచాయతీలో అధికారులు పోస్టింగ్‌‌‌‌ ఇచ్చారు. ఆ గ్రామంలో ఓ ఆర్‌‌‌‌ఎంపీ, మరో వ్యక్తి మధ్య ఇంటి స్థలం విషయంలో వివాదం ఉంది. ఆ స్థలాన్ని ఇటీవల రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించుకున్న వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేయగా.. వివాదం గురించి తెలియని పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇచ్చేశారు. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న ఆర్‌‌‌‌ఎంపీ సదరు కార్యదర్శి దగ్గరికి వచ్చి బండబూతులు తిట్టి వెళ్లాడు. తెలియక చేసిన తప్పుతో తనకు ఎక్కడ ముప్పు వస్తుందోనని కార్యదర్శి ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఈ ఒక్క కార్యదర్శి సమస్యే కాదు.. కొత్తగా ఉద్యోగంలో చేరిన జూనియర్‌‌‌‌ కార్యదర్శులందరి పరిస్థితి ఇలానే ఉంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అనుమతుల విధానం, కొత్త పంచాయతీరాజ్‌‌‌‌ చట్టంపై సీనియర్‌‌‌‌ కార్యదర్శులకు కూడా అవగాహన లేకపోవడంతో జూనియర్లను గైడ్ చేయలేకపోతున్నారు.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సర్కార్‌‌‌‌ నౌకరీ వచ్చిందని ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. రావడం రావడంతోనే డ్యూటీలో చేరిపోయారు. ఎలాంటి ట్రైనింగ్ లేదు. ఏ రికార్డు ఎలా రాయాలో, ఏ సర్టిఫికెట్‌‌‌‌ ఎలా జారీ చేయాలో, ఏ అనుమతి ఎలా మంజూరు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఉత్సాహంగా జాబ్‌‌‌‌లో చేరిన జూనియర్‌‌‌‌ పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

భయపెడుతున్న పనిష్మెంట్లు

కొత్త పంచాయతీరాజ్‌‌‌‌చట్టం- ప్రకారం గ్రామంలోని ప్రతి పనికి కార్యదర్శే బాధ్యత వహించాలి. విధి నిర్వహణలో విఫలమైతే సస్పెన్షనే కాకుండా ఉద్యోగం నుంచి డిస్మిస్‌‌‌‌ చేసేంతటి శిక్షలు ఉండటంతో కొత్త కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఏ సంతకం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. మరోవైపు విధివిధానాలు తెలియక ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలియనోడివి డ్యూటీ ఎందుకు చేస్తున్నావంటూ ప్రజలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు.

గ్రామానికో కార్యదర్శి

గతంలో మూడు, నాలుగు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. దీంతో అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు నత్తనడకన సాగేవి. తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఊరికో పంచాయతీ కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం భావించింది. పంచాయతీల పాలనను గాడినపెట్టేందుకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఇటీవల భర్తీ చేసింది. ఏప్రిల్‌‌‌‌ 11న అపాయింట్‌‌‌‌మెంట్ ఆర్డర్స్‌‌‌‌ అందుకున్న కార్యదర్శులు ఒకటి, రెండు రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో ఉద్యోగంలో చేరారు. గ్రామాల గ్రేడ్‌‌‌‌లు, సీనియర్‌‌‌‌ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌‌‌‌లను పరిగణనలోకి తీసుకోకుండా జూనియర్లకు గ్రేడ్‌‌‌‌ 1, 2 పంచాయతీల్లో పోస్టింగ్‌‌‌‌ ఇవ్వడం కూడా వివాదాస్పదంగా మారింది. జిల్లాల విభజనతో నాన్‌‌‌‌ లోకల్‌‌‌‌గా మారిన సుమారు 800 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌‌‌‌ ఇవ్వకపోవడంతో న్యాయం చేయాలని ఇప్పటికీ పంచాయతీ శాఖ మంత్రి, శాఖ ఉన్నతాధికారుల చుట్టూ వారు తిరుగుతున్నారు.