భద్రాచలంలో రమణీయంగా గోదాదేవి-రంగనాథుల కల్యాణం

భద్రాచలంలో  రమణీయంగా గోదాదేవి-రంగనాథుల కల్యాణం

భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భోగి వేళ గోదాదేవి-రంగనాథుల కల్యాణం బుధవారం అత్యంత వైభవోపేతంగా, భక్తిప్రఫత్తులతో జరిగింది. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలతో వ్రతం పూనిన గోదాదేవి ఆ వ్రతం ముగిసిన అనంతరం  రంగనాథునుడిని కల్యాణమాడిన వేడుకను వేదపండితులు వేదోక్తంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలు ముగిశాయి. ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చిన అర్చకులు గర్భగుడిలో స్వామికి భోగి పండుగ వేళ విశేష తిరుమంజనం చేశారు. 

సుప్రభాత సేవను చేసి బాలబోగం నివేదించారు. ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి అక్కడ గోదాదేవి-రంగనాథుల కల్యాణ క్రతువును ప్రారంభించారు.  ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు.  తర్వాత గోదాదేవి, రంగనాథులకు రక్షాసూత్రం,కంకణ ధారణ, యజ్ఞోపవీతధారణ, సంకల్పం, సుమూహూర్తం, తలంబ్రాల ధారణ, వేదాశీర్వచనం వరుస క్రమంలో చేశారు.  అంతకుముందు ఉదయం గోదాదేవి, రంగనాథులకు తిరువీధి సేవ జరిగింది.

 ఆలయం నుంచి రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయం వరకు స్వామి సేవకు వెళ్లి వచ్చారు. తిరుప్పావై ప్రవచనాలు చేసిన సువర్ణను దేవస్థానం తరుపున సత్కరించారు. శేషవస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదం అందజేశారు. భోగి పర్వదినం కావడంతో భక్తులతో ఆలయం పోటెత్తింది. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. 

సాయంత్రం స్వామికి దర్బారు సేవను చేశారు. దివిటీ సలాం ఇచ్చారు.  భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గోదాదేవి,రంగనాథుల కల్యాణం కారణంగా ఆలయంలో సీతారాముల నిత్య కల్యాణం నిలిపివేశారు. 

చండ్రుగొండ  : చండ్రుగొండలోని వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణం ఘనంగా జరిగింది. వేదపండితులు వేంకటేశ్వర శర్మ, భాస్కర శర్మ, ఆంజనేయ శాస్త్రి  ప్రత్యేక పూజలు చేశారు. పలువురు దంపతులు పీటలపై కూర్చున్నారు. పలు గ్రామాల భక్తులు కల్యాణాన్ని తిలకంచారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

 కల్లూరు :  కల్లూరు పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో  ధనుర్మాసం  ముగింపు వేడుకల  కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు సౌమిత్రి రామాచార్యులు,  ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణం మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు అనంతరం దేవతామూర్తులను శేష వాహనంపై  ఆలయం చుట్టూ  ఊరేగింపుగా ప్రదక్షిణలు  చేశారు.  భక్తులు పెద్ద సంఖ్యలో ఆయజరై మూల విరాట్ ను దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.