
- కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉన్నా
- తెలంగాణ నా సొంతిల్లు.. ఇక్కడ ఉద్యోగ జీవితం సంతృప్తినిచ్చింది
- నైతిక విలువలతో నన్ను ముందుకు నడిపిన తల్లిదండ్రులను కోల్పోవడం బాధించింది
- దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ 1 అని ప్రశంస
- పోలీస్ అకాడమీలో మాజీ డీజీపీ జితేందర్‌కు ఫేర్‌వెల్
హైదరాబాద్,వెలుగు: మాజీ డీజీపీ జితేందర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగరీత్యా 40 ఏండ్ల పాటు కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం బాధకలిగించిందంటూ కంటతడి పెట్టారు. ఉద్యోగం వచ్చాక పంజాబ్‌లోని తన సొంతూరులో కనీసం 40 రోజులు కూడా ఉండలేదని.. 40 ఏండ్లుగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోయానన్నారు. తెలంగాణ రాష్ట్రం తన సొంతిల్లు అని పేర్కొన్నారు. డీజీపీగా జితేందర్ పదవీ విరమణ సందర్భంగా రాష్ట్ర తెలంగాణ పోలీస్ అకాడమీ(టీజీపీఏ)లో మంగళవారం ఫేర్‌వెల్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీలు, ఐజీలు, మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజనీకుమార్‌తోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పరేడ్ అనంతరం మాజీ డీజీపీ జితేందర్ మాట్లాడారు. పంజాబ్‌కు చెందిన తనను ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉమ్మడి ఏపీ కేడర్‌కు కేటాయించారని చెప్పారు. అప్పట్లో కొంత ఆలోచనలో పడ్డానని, కానీ ఇప్పుడు తెలంగాణ తన సొంత ఇల్లుగా మారిందని తెలిపారు. తెలంగాణలో ఉద్యోగ జీవితం తనకు పూర్తిగా సంతృప్తి నిచ్చిందని చెప్పారు. సైబర్ క్రైం, డ్రగ్స్ కట్టడితో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని కొనియాడారు.
చిన్నతనంలోనే పంజాబ్‌లో..
చిన్న తనంలో 20 ఏండ్లు మాత్రమే పంజాబ్‌లో ఉన్నానని జితేందర్ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రజలతో తనకు ఎనలేని అనుబంధం ఏర్పడిందన్నారు. డీజీపీగా రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబంతో ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. డీజీపీగా తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన వృత్తిగత జీవితంలోని అనుభవాలు గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా మూలాలు మరవొద్దని, తల్లిదండ్రులు నేర్పిన విలువలు తాను ఎప్పటికీ మరువలేదని చెప్పారు. తన జీవితంలో విజయాలు సాధించడంలో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉందన్నారు.
తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు
డీజీపీగా పనిచేసిన 14 నెలల్లో తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, మావోయిస్టులు, టెర్రరిస్టుల దాడులలాంటి ఘటనలకు తావులేకుండా పనిచేశామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ అని పేర్కొన్నారు. దాన్ని కొనసాగించేలా మున్ముందు పనిచేయాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగంలో పోలీసులుఎంతో ముందున్నారని కితాబిచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇటీవల ఏర్పాటు చేసిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కామారెడ్డి వరదల సందర్భంగా అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. కొత్త డీజీపీ శివధర్‌రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని, సమర్థవంతమైన అధికారిగా పేరున్న శివధర్‌రెడ్డి డీజీపీ పదవికి అర్హుడని పేర్కొన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కొత్త డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. డీజీపీగా జితేందర్ అనుభవం భవిష్యత్ పోలీసింగ్‌లో మార్గదర్శనంగా ఉంటుందని చెప్పారు.