కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
  • సీపీఎం, సీపీఐ ఆఫీసుల్లో జెండావిష్కరణలు
  • సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్, వెలుగు:  మేడే స్ఫూర్తితో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలనీ లెఫ్ట్ పార్టీల నేతలు, కార్మిక సంఘాల లీడర్లు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం, సీపీఐతో పాటు లెఫ్ట్ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. చిక్కడపల్లిలోని ఎంబీభవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి ఆ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోరాటానికి సంకేతంగా మేడేను ప్రపంచంలోని కార్మికులంతా జరుపుకుంటారని గుర్తుచేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, పోరాడి సాధించుకున్న అనేక హక్కులను హరించివేస్తోందని చెప్పారు. 8 గంటల పని విధానాన్ని మార్చుతున్నదని, మళ్లీ వెట్టిచాకిరి విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, భూములు, గనులు, ఓడరేవులు, ఎయిర్ పోర్టులను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరుతో ఆయన మనసులో మాట చెప్తారని, కానీ ప్రజల మన్​కీ బాత్ ఆయన వినాలని కోరారు. కార్యక్రమంలో  సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, టి.సాగర్, భాస్కర్, బండారు రవికుమార్, హైమవతి, శ్రీరాంనాయక్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

మఖ్దూం భవన్​లో మేడే..

సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేశ్ ఆ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చికాగో నగరంలో అమరులైన కార్మికుల రక్తంతో ఎర్రజెండా ఆవిర్భవించిందని, ప్రపంచ వ్యాపితంగా 8 గంటల పనివిధానం అమలులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర ప్రభుత్వం అనేక సవరణలు తెచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి.. కార్మికుల ప్రతికూలంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.

బీఎంఎస్ మే డే నిర్వహించట్లేదు

మే డే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎంసీఏ చౌరస్తా నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మే డే స్థానంలో విశ్వకర్మ జయంతిని ప్రవేశపెట్టాలనీ బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీఎంఎస్ కూడా మే డే నిర్వహించడం లేదన్నారు. మే డే అంటే పోరాట దినమని హక్కుల కోసం అనేక మంది వీరులు అమరులైన రోజని గుర్తు చేశారు. కులాలు, మతాలు ప్రాంతాల పేరుతో కార్మికవర్గాన్ని చీల్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు జే వెంకటేశ్, పద్మశ్రీ,  కుమారస్వామి, ఎమ్ వెంకటేశ్ 
తదితరులు పాల్గొన్నారు.