చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలే కానీ, ఎనభై ఏండ్ల వయసులోనూ డిగ్రీ పాస్ కావొచ్చని నిరూపించాడు ఈయన. అమెరికాలోని టెక్సాస్‌లో ఉండే రెనే నీరకి 87 ఏండ్లు. ఈమధ్యే మనవరాలు మెలనీ సలజార్తో కలిసి డిగ్రీ పట్టా అందుకున్నాడు. నీరకి కాలేజీ రోజుల్లోనే పెండ్లి కావడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. కొన్నేండ్ల కిందట అతని భార్య చనిపోయింది. ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. మధ్యలో ఆపేసిన కాలేజీ చదువుని కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. మనవరాలితో కలిసి 2016లో సాన్ ఆంటోనియో కాలేజ్ ఆఫ్ లిబరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కాలేజీలో చేరాడు. అప్పటికి ఆయన వయసు 82 ఏండ్లు. ముసలితనంలోనూ ఇష్టంగా పుస్తకాలు తిరగేసి, ఈమధ్యే బిఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాడు. అతని మనవరాలు మెలనీ మాస్కమ్యూనికేషన్లో బిఏ డిగ్రీ అందుకుంది. తాతతో కలిసి ఒకేసారి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్న క్షణం సంతోషంతో ఎగిరి గంతేసింది మెలనీ. కాన్వొకేషన్ నాడు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వీల్‌ఛెయిర్‌లో వచ్చి పట్టా తీసుకున్నాడు ఈ పెద్దాయన. తాత, మనవరాలు డిగ్రీ పట్టా పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోల్ని ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టారు యూనివర్సిటీ వాళ్లు. ఆ ఫొటోలు చూసినవాళ్లు ‘వావ్... అద్భుతం. ఇద్దరికీ కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
