ఈ బామ్మకు116 ఏండ్లు.. ఆమె ఆరోగ్యం రహస్యం ఏమిటో..

ఈ బామ్మకు116  ఏండ్లు.. ఆమె ఆరోగ్యం రహస్యం ఏమిటో..

ఎథెల్ కేటర్​హామ్​.. 1909, ఆగస్టు 21న ఇంగ్లాండ్​లోని హాంప్​షైర్​లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు అక్షరాలా నూటపదహారేండ్లు (116). ప్రజెంట్ వందేండ్లు పైబడి బతికున్నవాళ్లలో రికార్డు వయసు ఈ బామ్మదే. నిండా నూరేళ్లు నిండి.. మరో పదహారేండ్లు గడిచింది. ఆమె జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలు, 27 మంది ప్రధానమంత్రులను చూసింది. శతాబ్ద కాలంగా ఎన్నో వింతలు, విశేషాలు, పోరాటాలు వంటివి కళ్లారా చూసింది. ఇంతకీ బామ్మ ఇన్నేండ్లు ఆరోగ్యంగా ఉండడానికి వెనుక ఉన్న రహస్యమేంటి? అనడిగితే.. ‘‘నెవర్​ ఆర్గ్యూ” అని చెప్పింది. 

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం ద్వారా జీవన విధానం మెరుగవుతుంది. తద్వారా జీవితకాలం పెరుగుతుందని తెలిసిందే. అయితే, వాటితోపాటు ముఖ్యంగా పాటించే సీక్రెట్​ మాత్రం ‘‘ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం, ఎవరు ఏం చెప్పినా వినడం, నాకు నచ్చింది నేను చేయడమే” అని చెప్పింది ఎథెల్ బామ్మ. ఇందులోని ఫిలాసఫీ ఏంటంటే.. ఎవరు ఏం చెప్పినా వాళ్లతో ఏకీభవించడం వల్ల ఒత్తిడి అనేది అసలు ఉండదు. దీంతో ఫిజికల్​, మెంటల్​గా బలంగా తయారవుతారు. అంతేకాదు.. ఈ బామ్మ ఓపెన్​ మైండ్​తో అవకాశాలను స్వీకరించడం, సాదాసీదాగా జీవితాన్ని గడపడం కూడా కారణాలు అని గతంలో చెప్పింది. 

ఇండియాకు వచ్చింది

ఎథెల్ పద్దెనిమిదేండ్ల వయసులో ఇండియాను విజిట్ చేసింది. అప్పుడు ఒక బ్రిటిష్​ ఫ్యామిలీకి ఆయాగా పనిచేసింది. అది 1927, అప్పట్లో యువతులు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడం కామన్​. మూడేండ్ల తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్లింది. తర్వాత ఒక డిన్నర్​ పార్టీలో పరిచయం అయిన బ్రిటిష్​ ఆర్మీలో పనిచేసే నార్మన్​ను పెండ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. 

1976లో భర్త, ఆ తర్వాత పిల్లలు కూడా చనిపోయారు. కానీ, ఎథెల్ ఫ్యామిలీలోనే ఎక్కువకాలం బతికిన చరిత్ర ఉంది. ఆమె అక్క104 ఏండ్లు బతికింది. ఇప్పుడు ఎథెల్ ఐదో జనరేషన్​ను చూస్తోంది. 2020లో కొవిడ్​ సోకగా దాన్నుంచి కోలుకుంది. ఇలా రకరకాల బాధలు అనుభవించిన ఎథెల్ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ ఏడాది 116 వ పుట్టినరోజు సందర్భంగా గిన్నిస్​ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది.