బండరాళ్ల మధ్య చితికిన బతుకులు

బండరాళ్ల మధ్య చితికిన బతుకులు
  • ఔటర్ టోల్ ప్లాజా డివైడర్ ఢీ కొన్న గ్రానైట్ డీసీఎం
  • రాళ్ల మధ్య ఇరుక్కొని ముగ్గురు కార్మికుల మృతి,నలుగురికి తీవ్రగాయాలు
  • తుక్కుగూడ ఎగ్జిట్‌-14 వద్ద ప్రమాదం

గ్రానైట్‌‌ లోడ్‌‌ దించేందుకు డీసీఎంపై కూలికి వెళ్లిన కార్మికుల బతుకులు ఆ బండరాళ్ల మధ్య చితికి పోయాయి. డీసీఎం డివైడర్‌‌కు గుద్దుకోవడంతో వెనక లోడ్‌‌తోపాటు ఉన్న కార్మికులపై రాళ్లు పడి ముగ్గురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. గాజులరామరం నుంచి కల్వకుర్తికి శుక్రవారం ఓ డీసీఎం(ఏపీ 28టీఏ 2410 ) గ్రానైట్ బండల లోడ్‌‌తో బయల్దేరింది. లోడ్‌‌ దించేందుకు పది మంది బండలు మోసే కార్మికులు కూడా డీసీఎంతో పాటు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్-14 వద్ద దిగే క్రమంలో డీసీఎం టోల్ ప్లాజా డివైడర్‌‌ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలో వెనక గ్రానైట్ బండల మధ్యన కూర్చున్న ముగ్గురు కార్మికులు వాటి మధ్య ఇరుక్కొ ని అక్కడిక్కడే మృతి చెందారు.

మృతులను ఎల్లమ్మబండకు చెందిన రాము(32),సాయిలు(40), కూకట్‌‌పల్లికి చెంది న శ్రీనివాస్ (38)గా గుర్తించారు. మరో నలుగురు కార్మికులు సంగయ్య, సత్యనారాయణ, పండరి, ఎర్ల సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. బండల మధ్యన ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కొన్నిగంటల పాటు వారు నరకయాతన పడ్డారు. గాయపడ్డ వారిని ఉస్మా నియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పహాడీషరీఫ్ ఎస్సై కుమారస్వామి తెలిపారు. ఈ ప్రమాదం డీసీఎం బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లనా .. లేక అతి వేగం వల్ల జరిగిందా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.