
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వారి ఫ్యాన్సే కాక.. యావత్ క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం, ఆవేదనకు గురయ్యారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ సడెన్ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోహ్లీ ఫామ్, ఫిట్ నెస్ ప్రకారం.. మరో రెండు, మూడేండ్లు ఈజీగా ఈ రన్ మెషిన్ టెస్ట్ క్రికెట్ ఆడొచ్చు.
కానీ ఎవరూ ఊహించని విధంగా ఉన్నఫలంగా తనకు ఎంతో ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకోని అభిమానులకు కోహ్లీ బాధను మిగిల్చాడు. కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు వారం రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దానిపై చర్చ జరుగుతుందంటే ఆ ప్రభావం ఎంత ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్‌ల రిటైర్మెంట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ స్పందించారు.
కోహ్లీ, రోహిత్ వంటి గొప్ప ఆటగాళ్లు 50 ఏళ్ల వరకు ఆడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకోవడం టీమిండియా భారీ ఎదురు దెబ్బ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నేను భావిస్తున్నానని అన్నారు. కేవలం యువకులతో కూడిన జట్టును మాత్రమే ఎంపిక చేయడం కరెక్ట్ కాదని.. జట్టులో సీనియర్స్ తప్పకుండా ఉండాలన్నారు.
►ALSO READ | R Ashwin: బుమ్రా కాదు అతడే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు కరెక్ట్.. మాట మార్చిన అశ్విన్
కేవలం యువకులతో కూడిన జట్టును ప్రకటిస్తే.. ఇంగ్లాండ్‌లోని కఠినమైన పరిస్థితుల్లో అది కూలిపోయే అవకాశం ఉందన్నారు. కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞులు లేకపోవడంతో జట్టులోని యువకులను ప్రేరేపించడానికి ఇప్పుడు ఎవరు లేరన్నారు. కోహ్లీ, రోహిత్‌లను రిటైర్ కాకుండా ఆపకపోవడానికి ఎవరూ లేకపోవడం పట్ల విచారకరమన్నారు.