హైదరాబాద్‌‌లో.. 11వేల 700 ఇండ్ల పంపిణీ

హైదరాబాద్‌‌లో..  11వేల 700 ఇండ్ల పంపిణీ
  • 9 ప్రాంతాల్లో అందజేసిన మంత్రులు, లీడర్లు
  • ఆర్టీసీ బస్సుల్లో లబ్ధిదారుల తరలింపు.. కొన్నిచోట్ల ఆందోళనలు, అడ్డగింతలు
  • బహదూర్‌‌‌‌పల్లిలో స్థానికుల ఆందోళన.. 
  • కొన్ని రాజకీయ కుక్కలు మొరుగుతున్నాయన్న మంత్రి తలసాని

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో 11,700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. శనివారం 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ మేరకు ఇండ్లను పంపిణీ చేశారు. ఇటీవల లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను తెల్లవారుజామున డబుల్ బెడ్రూం ఇండ్ల సైట్ వద్దకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఇండ్లు రాని వారు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ఎవరూ లోపలికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల కంటే ఎక్కువగా పోలీసులే కనిపించడం గమనార్హం. సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1,700 మంది లబ్ధిదారులకు ఇండ్లను కుత్బుల్లాపూర్‌‌‌‌లోని బహదూర్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనం అక్కడికి భారీగా చేరుకున్నారు. తమకు ఇండ్లు ఎందుకివ్వలేదని మంత్రి తలసానిని అడ్డుకున్నారు. ఇక్కడి స్థానికులను కాదని కోర్ సిటీ నుంచి తీసుకొచ్చిన వాళ్లకు ఇండ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఘట్ కేసర్ లోని ప్రతాప సింగారంలో ఇండ్లను పంపిణీ చేసేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ని ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానికులు నిలదీశారు. స్థానికులకి ఇవ్వకుండా ఎక్కడి నుంచే తీసుకొచ్చిన వారికి ఇండ్లను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మంఖాల్--1లో నిర్మించిన 2,230 ఇండ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 

అన్ని వసతులతో ఇండ్లు: మంత్రి తలసాని

పేదలపై ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి తలసాని అన్నారు. బహదూర్ పల్లిలో ఇండ్ల పంపిణీ తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చూసుకున్నాం. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదు. మొదటి విడతలో ఇండ్లు రానివారు ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తాం. మొదటి విడతలో 11,700 మందికి ఇండ్ల పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో రూ.10 వేల కోట్ల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టాం. కొందరు దుర్మార్గులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలను నమ్మొద్దు. ఇళ్లు ఎప్పుడు ఇస్తారని కొన్ని రాజకీయ కుక్కలు మొరుగుతుంటాయి. కట్టినోళ్లకు మాకు తెలుసుకదా ఎప్పుడు ఇయ్యాల్నో.” అని కోరారు.

మేయర్ కాళ్లపై పడిన మహిళ

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో స్థానికులకు అన్యాయం చేశారంటూ ఉప్పల్‌‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాప్రాసర్కిల్ శ్రీరామ్‌‌నగర్ లో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ విజయలక్ష్మి రావడానికి ముందే పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. తర్వాత ఇండ్ల కేటాయింపును మేయర్ చేపట్టారు. ఈ సమయంలో శ్రీరాం నగర్ కి చెందిన ఓ మహిళ ‘‘అమ్మా.. నాకు డబుల్ బెడ్రూమ్‌‌ ఇల్లు రాలేదు. చాలా పేద మహిళని.. నీ కాళ్లుమొక్కుతా. నాకు ఇల్లు ఇప్పించండి” అంటూ మేయర్ కాళ్లపై పడింది. తర్వాత మేయర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ఇల్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మొత్తం 6 విడతలు ఒక్కో విడతలో 12 వేల చొప్పున ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 15 రోజుల్లో మరో విడత పంపిణీ చేపడతామని అన్నారు. మరికొందరు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, దశలవారీగా ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు.

ధనికులు ఉండే ఏరియాల్లో పేదలకు ఇండ్లు: మంత్రి పట్నం

పటాన్​చెరు నియోజకవర్గంలో దాదాపు 30 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందని, స్థానిక కోటా కింద 10 శాతం ఇండ్లను స్థానికులకు కేటాయిస్తామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం కర్ధనూర్​లో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి లాటరీ ద్వారా కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధనికులు మాత్రమే ఉండే ఏరియాల్లో పేదలకు కూడా ఇండ్ల నిర్మించి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

మాది చేతల  ప్రభుత్వం: హరీశ్ రావు

రామచంద్రాపురం, వెలుగు: బీఆర్ఎస్‌‌ది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, అందుకే అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. పటాన్​చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన వారికి ఇండ్ల బ్లాకులను కేటాయించి, ఇంటి పత్రాలు అందజేశారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 500 ప్లాట్ల చొప్పున కేటాయించారు. కొల్లూరులో నిర్మించిన పేదల సముదాయం ఆసియాలోనే ఎక్కడా లేదని, రూ.60 లక్షల విలువైన ఒక్కో ఇంటిని పేదలకు ఇస్తున్నామన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.