కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం

కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం

మబ్బు పడితే వణుకుడే

వరద పోక ముందే మళ్లీ వానలు

-సహాయక చర్యల కోసం ఎదురుచూపులు

ఐదు వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం

సర్కారు ఆదుకోవాలంటున్న బాధితులు

హైదరాబాద్, వెలుగు: వరుసగా కురుస్తున్న కుండపోత వానలు, ముంచెత్తుతున్న వరదలతో ఎప్పుడేం జరుగుతదోనని గ్రేటర్​ హైదరాబాద్​ జనం భయం భయంగ గడుపుతున్నరు. ఇప్పటికే మునిగిన ప్రాంతాల్లో నీళ్లు తగ్గిపోక ముందే.. మళ్లీ పడుతున్న వానలతో వరదలు వచ్చి ఆగమాగం అవుతున్నరు. ఇండ్లలో ఉన్న నిత్యావసరాలు, సామాన్లు, బట్టలు, ఎలక్ట్రానిక్​ ఐటమ్స్ అన్ని తడిసిపోయి లబోదిబోమంటున్నరు. కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నరు. వరద చేరిన ప్రాంతాల్లోని కొందరు ఇండ్లను వదిలి షెల్టర్లలో ఉంటుంటే.. మరికొందరు చుట్టాల ఇండ్లకు వెళ్లిపోయారు. ఇంకా వేలాది మంది సర్వస్వం కోల్పోయి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్​లో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రూ.5 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

మరోవైపు పునరావాస కేంద్రాలుగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్లలో కనీస వసతులు లేవని, అన్నం కూడా సరిగా పెట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పాత ఇండ్లుగా గుర్తించి కూల్చేస్తున్న చోట సర్కారే కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

సాయం కోసం ఎదురుచూస్తున్న జనం

వరదలో మునిగిన కాలనీల్లో చాలా చోట్ల సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మందికి ఇంకా నిత్యావసరాలు, ఇతర సాయం అందడం లేదు. వారం నుంచి వానలు పడి, వరద పోటెత్తితే సర్కారు ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేస్తుండటంపై ఆగ్ర హం వ్యక్తమవుతోంది. చాలా చోట్ల ఐదారు అడుగుల లోతులో నీళ్లు చేరడంతో.. సహాయక చర్యలకు బోట్లు అత్యవసరం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న బోట్లు 8 మాత్రమే. చాలా చోట్ల స్థానికులే ట్యూబులు, డ్రమ్ములకు కట్టెలు కట్టి.. వాటిపై వెళ్తూ బాధితులకు సాయం అందించారు. రాష్ట్ర సర్కారు మంగళవారం ఇతర రాష్ట్రాల నుంచి బోట్లు తెప్పించింది.

వేల కోట్ల ఆస్తి నష్టం

కుండపోత వానలు, నాలాలు ఉప్పొంగి రోడ్లు, డ్రైనేజీలు, చెరువు కట్టలు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు, ఇండ్లు, ఇతర ఆస్తులు దెబ్బతినడంతో తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. ముంపు ఏరియాల్లోని ఇండ్లలో ఎలక్ట్రానిక్​ వస్తువులు, ఫర్నీచర్, నిత్యావసరాలు, కార్లు, బైకులు, ఇతర వెహికల్స్​కు పాడైపోయాయి. మొత్తంగా నష్టం రూ.ఐదు వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేశారు.

ఇల్లు కూలగొట్టిండ్రు.. తిండి కూడా పెడ్తలేరు

బషీర్​బాగ్​లోని ఓల్డ్​ ఎమ్మెల్యే కాలనీలో పాత ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఆ ఇండ్లలోని వారికి సమీపంలోని సంజయ్​ గాంధీ కమ్యూనిటీ హాల్ లో షెల్టర్​ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఏర్పాట్లు సరిగా లేవని, తమను ఆదుకోవాలని బాధితులు.. కూల్చిన తమ ఇండ్ల ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందలేదన్నారు. షెల్టర్​లో తినడానికి తిండి పెట్టడం లేదని.. తాగడానికి నీళ్లు కూడా లేవని వాపోయారు. కమ్యూనిటీ హాల్​ను ఖాళీ చేయాలని, ఇక్కడ పెళ్లి కార్యక్రమం ఉందని స్థానికులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్ల స్థానంలో సర్కారే ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అమ్మ చనిపోయింది.. ఎవరూ పట్టించుకోవట్లేదు

మంగళవారం వానకు ఇంట్లో కి ఒక్కసారిగా వరద వచ్చింది. ఎటూపోలేక అమ్మ, నేను ఇంట్లనే ఉన్నం. తర్వాతి రోజు ఆమె ఆరోగ్యం
క్షీణించింది. ఇంట్లో నీళ్లు చేరి ఉండటంతో.. అమ్మను హాస్పిటల్లో చూపించి చుట్టాల ఇంటికి తీసుకుపోయిన. కానీ ఆ రోజే ఆమె
చనిపోయింది. గతంలో మా అన్న కూడా వరదలతోనే చనిపోయిండు. ఇప్పుడు అమ్మ కూడా చనిపోవడంతో ఒంటరిదాన్ని అయిన.
అమ్మ పెన్షన్ మీదనే ఇద్దరం బతికేటోళ్లం. ఇప్పుడు నన్ను ఆదుకోవడానికి ఎవరూ రాలే. ఏం జరిగిందని కూడా అడిగినోళ్లు లేరు.

– విజయలక్ష్మి, ప్రశాంత్ నగర్ ఫేజ్-2, లంగర్ హౌస్

సర్కారే ఇండ్లు కట్టియ్యాలె..

ఉన్న ఇండ్లను కూలగొట్టిన్రు. ఇప్పుడు మేం ఎక్కడ ఉండాలె. కమిటీ హాల్ కు పోతే అక్కడ ఏర్పాట్లు లేవు. ఎవరిని అడిగినా
పట్టించుకుంట లేరు. కనీసం టైంకు తిండి కూడా పెడ్తలేరు. సర్కారు మా ఇండ్లు కూల్చిన చోటనే కొత్తగా ఇండ్లు కట్టియ్యాలె..

– లక్ష్మమ్మ, బషీర్​బాగ్​ వాసి

For More News..

ఇయ్యాల, రేపు వానలు