గ్రేటర్ హైదరాబాద్ వాటర్ బోర్డుకు కాసుల పంట.. వెస్ట్ సిటీ నుంచి పెరిగిన నల్లా కనెక్షన్లు

గ్రేటర్ హైదరాబాద్ వాటర్ బోర్డుకు కాసుల పంట.. వెస్ట్ సిటీ నుంచి పెరిగిన నల్లా కనెక్షన్లు
  • గతంలో  నెలకు 1500 దరఖాస్తులే 
  • ఇప్పుడు రెండున్నర వేల వరకు..
  • హైరైజ్ బిల్డింగులు, విల్లాలు, అపార్ట్​మెంట్ల నిర్మాణాలే కారణం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డుకు కాసుల పంట పండుతోంది. ముఖ్యంగా వెస్ట్​సిటీ వైపు నుంచి భారీగా కొత్త నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తులు వస్తుండడంతో ఆదాయమూ పెరుగుతోంది. హైరైజ్​ భవనాలు, విల్లాలు, అపార్ట్​మెంట్ల నిర్మాణాలు ఎక్కువగా వెస్ట్​సిటీ వైపే జరుగుతున్నాయి. 

శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, మాదాపూర్, కోకాపేట, తెల్లాపూర్, వట్టినాగుల పల్లి, నార్సింగి వంటి ప్రాంతాల్లో అధికంగా కొత్త నిర్మాణాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా ఐటీ కారిడార్​లో కొత్తగా ఆఫీసులు, అపార్ట్​మెంట్ల నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువగా నీటి కనెక్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఇన్​కమ్​కూడా భారీగానే వస్తోంది. 

వెస్ట్​ సిటీలో వెయ్యి పెరిగినయ్​

గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో నెలకు 3 వేల నుంచి 3.5 వేల వరకు కొత్త నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. కానీ, ఆరు నెలలుగా వీటి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకు 4 వేల నుంచి 4.5 వేల కనెక్షన్లకు దరఖాస్తులు వస్తున్నాయి.  ఇంతకు ముందు వెస్ట్​సిటీ నుంచి నెలకు వెయ్యి నుంచి 1500  కొత్త కనెక్షన్లకు దరఖాస్తులు వచ్చేవని, నాలుగైదు నెలల నుంచి 2వేల నుంచి 2.5 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. వీటిలో అధికశాతం కమర్షియల్, బల్క్, మల్టీస్టోరీడ్​ కేటగిరీవేనని చెప్తున్నారు. ఇలాంటి కనెక్షన్ల ద్వారానే బోర్డుకు ఎక్కువ ఆదాయం 
ఉంటుందంటున్నారు.  

ఆదాయం ఇలా..

ఆరు నెలల క్రితం వరకూ బోర్డుకు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, రెండు మూడు నెలల నుంచి రూ. 100 నుంచి రూ.120 కోట్లకు పెరిగిందని వాటర్​బోర్డు అధికారులు అంటున్నారు గ్రేటర్​లో 13.90 లక్షల కనెక్షన్లుండగా, కమర్షియల్​కనెక్షన్ల విషయానికి వస్తే ఆరు నెలల క్రితం వరకూ 50వేల వరకు ఉండగా ప్రస్తుతం 70 నుంచి 75వేలకు పెరిగాయి. నెలకు అన్ని ప్రాంతాల నుంచి కలిపి 4 వేల నుంచి 4.5 వేల కనెక్షన్ల కోసం దరఖాస్తులు వస్తుండగా, ఇందులో 2.5 వేల కనెక్షన్లు వెస్ట్​సిటీ నుంచి వస్తున్నాయి. 

ముఖ్యంగా వెస్ట్​సిటీ వైపున భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం ఒక కారణమైతే, భారీ నిర్మాణాలు, టౌన్​షిప్​లు, విల్లాలకు భారీగా నీటి అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు బోర్డు సరఫరా చేస్తున్న నీటితో పాటు అదనంగా మిషన్​భగీరథ నుంచి వాటర్​బోర్డు తీసుకుంటున్నట్టు 50 ఎంజీడీలు కూడా ఈ ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాటర్​బోర్డు కూడా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వెస్ట్​సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది.