గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్​లో కార్పొరేటర్ల ఆందోళన

గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్​లో కార్పొరేటర్ల ఆందోళన

హనుమకొండ, వెలుగు:‘మునుపు కౌన్సిల్ ఆమోదం పొందిన పనులకు టెండర్లు పిలుస్తలేరు. చాలాపనులు పెండింగ్ లోనే ఉన్నయ్. మిషన్​భగీరథ నీళ్లు సరిగ్గా రావట్లేదు. ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఆఫీసర్లకు చెప్పినా లైట్ తీసుకుంటున్నరు. కార్పొరేటర్​ గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం’ అంటూ పలువురు అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆఫీసర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వరంగల్ బల్దియాలో మేయర్​ గుండు సుధారాణి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ మీటింగ్ హాట్ హాట్​గా సాగింది. మొదట మూడు ఎజెండా అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మేయర్​గుండు సుధారాణి మాట్లాడుతూ.. యునెస్కో గ్లోబల్ నెట్ వర్క్ ఆఫ్ సిటీస్​లో వరంగల్ నగరానికి చోటు దక్కడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 31న జర్మనీలో జరిగే వరల్డ్ సిటీస్​డేలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. 2021 జూన్​నుంచి జనరల్​ఫండ్స్ ద్వారా రూ.222 కోట్లతో 1,463 పనులు మంజూరు చేశారని, అందులో రూ.65.33 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. రూ.61 కోట్లతో 224 పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.96 కోట్లతో 543 వర్క్స్​ ప్రారంభించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రగతి కింద నగరంలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.16.90 కోట్లతో 106 వర్క్స్​ సాంక్షన్​ చేశారని, ఇందులో రూ.6.6 కోట్లతో 56 పనులు పూర్తయ్యాయన్నారు. రూ.3.7 కోట్లతో 13 పనులు పురోగతిలో ఉన్నాయని, 39 వర్క్స్​ తొందర్లోనే ప్రారంభమవుతాయని చెప్పారు.

ఆఫీసర్లపై గరంగరం
కౌన్సిల్ మీటింగ్​ లో ఆఫీసర్ల తీరుపై కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్​మెంట్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాన్ ఒకలా సమర్పించి, రూల్స్​కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని గ్రేటర్​ 59వ డివిజన్​ కార్పొరేటర్​ గుజ్జుల వసంత, మరికొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. నగరంలో మిషన్​భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని ఏరియాల్లో నెలల తరబడి లీకేజీలు ఏర్పడుతున్నా ఆఫీసర్లు రిపేర్లు చేయించడం లేదని మండిపడ్డారు. కాలనీల్లో తుప్పు పట్టిన, వంగిన స్తంభాలను అలాగే వదిలేస్తున్నారని, వైర్లు కిందకు వేలాడి ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. డ్రైనేజీల నిర్మాణం, అంతర్గత రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో మంజూరు చేసిన రూ.50 లక్షల పనులకు టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నగరంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువైందని, మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నాయని కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో బల్దియా కమిషనర్​ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్​ రిజ్వానా షమీమ్​, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

పనులైతలేవని కార్పొరేటర్ల గైర్హాజరు
ఇప్పటికే కౌన్సిల్ మీటింగుల్లో చర్చించి, ఆమోదం పొందిన పనులకు సంబంధించిన టెండర్లు కంప్లీట్​ కాకపోవడం, వర్క్స్​ కూడా స్టార్ట్ కాకపోవడంతో చాలామంది అధికార, ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్​ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్​ అఫీషియో మెంబర్స్​ కౌన్సిల్ మీటింగులను లైట్​ తీసుకుంటుండగా..  మీటింగ్ లో చర్చించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని కొంతమంది కార్పొరేటర్లు కూడా కౌన్సిల్​ మీటింగ్​ కు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్​ పరిధిలో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఒకరిద్దరు మునుగోడు ప్రచారంలో ఉండగా..  మెజారిటీ కార్పొరేటర్లు అందుబాటులో ఉండికూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.

మీడియాను అనుమతించాలని బీజేపీ నిరసన
గ్రేటర్​ కౌన్సిల్ మీటింగ్​లకు మీడియాకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రజాసమస్యలు చర్చించే కౌన్సిల్​ హాలులోకి మీడియాను ఎందుకు అనుమతించరంటూ బీజేపీ మహిళా కార్పొరేటర్లు కొందరు ఆందోళనకు దిగారు. సర్వసభ్య సమావేశం ప్రారంభానికి ముందు కౌన్సిల్​ హాలు ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి మీడియాను అనుమతించేలా మేయర్​ యాక్షన్​ తీసుకోవాలని డిమాండ్​ చేశారు.