- ఒక్కో డివిజన్లో 9,800 నుంచి 10,500 ఓటర్లు
- 100 సీట్లకు పెంచాలని సీఎం రేవంత్‍రెడ్డిని కోరిన జిల్లా లీడర్లు
- 6 నుంచి 7 వేల ఓటర్లకో డివిజన్!
- త్వరలో ఓరుగల్లులో సీఎం రేవంత్‍రెడ్డి పర్యటనలో క్లారిటీ
వరంగల్, వెలుగు: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ దారిలోనే రెండో అతిపెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్ జీడబ్ల్యూఎంసీ అడుగులు వేస్తోంది. జీహెచ్‍ఎంసీని 150 డివిజన్ల నుంచి 300 వరకు పెంచినట్టు వరంగల్ జీడబ్ల్యూఎంసీ కూడా 66 డివిజన్ల నుంచి 100 డివిజన్లకు పెంచేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‍రెడ్డిని కోరారు. ప్రస్తుత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలోని పాలకవర్గం గడువు వచ్చే మే నెల 6న ముగియనుంది. ఈ క్రమంలో సీట్లను పెంచి, జులై తర్వాత ఎన్నికలకు వెళ్తారని టాక్ వినిపిస్తోంది. కాగా, త్వరలో సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్ పర్యటనలో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
11 లక్షల జనాభా.. 66 డివిజన్లు
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని గ్రేటర్ వరంగల్, హనుమకొండ, కాజీపేట లో దాదాపు 11 లక్షల జనాభా ఉంది. గ్రేటర్ వరంగల్ సిటీ ప్రధానంగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. 66 డివిజన్లు, మరో 42 విలీన గ్రామాల పరిధిలో 407.70 స్కేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
రెండు టర్ముల్లో 16 డివిజన్లు పెంపు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ ప్రభుత్వం గ్రేటర్ కార్పొరేషన్‍లో రెండు టర్ముల్లో కలిపి 16 డివిజన్లు పెంచింది. 1959 జులైలో స్పెషల్ క్లాస్ మున్సిపాలిటీగా మారిన వరంగల్ బల్దియాను 1994 ఆగష్టు 18న నగరపాలక సంస్థగా ప్రకటించారు. 2005లో ఫస్ట్ టైమ్ కార్పొరేషన్‍గా మారింది. 50 డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రం సపరేట్‍అయ్యాక 2015 జనవరిలో కేసీఆర్ సర్కార్ దీనిస్థాయిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍గా అప్‍గ్రేడ్ చేసి 58 డివిజన్లకు పెంచింది. ఆపై పాలన సౌలభ్యం పేరుతో 2021లో మరో 8 స్థానాలు పెంచగా 66కు చేరింది.
100 డివిజన్లు.. ఒక్కో డివిజన్లో 06 వేల ఓటర్లు
జీడబ్ల్యూఎంసీలో 2021 జనవరి 25 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో 6,52,978 మంది ఓటర్లున్నారు. సగటున ఒక్కో డివిజన్లో 9,800 నుంచి 10,500 ఓటర్లు ఉండేలాచేసి.. గతంలోని 58 డివిజన్లు 66 డివిజన్లకు పెంచారు. ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం ఏరియా పరంగా డివిజన్ల పరిధి తగ్గించి సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా 66 డివిజన్లను 100 పెంచే క్రమంలో ఒక్కో డివిజన్లో 06 వేల నుంచి 07 లోపు ఓటర్లు ఉండేలా మార్పుచేర్పులు చేయాలనే ఆలోచనతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం ముందర ప్రపోజల్స్ పెట్టారు.
తూర్పు, పశ్చిమలో 25 డివిజన్ల పెంపు.!
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం 2021 ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించారు. నాటి అధికార బీఆర్‍ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 4 చొప్పున విజయం సాధించారు. మే 7న గుండు సుధారాణి మేయర్‍గా పాలకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం వరంగల్ తూర్పు పరిధిలో 25 డివిజన్లు, పశ్చిమ నియోజకవర్గంలో 26, వర్ధన్నపేటలో 13, పరకాల పరిధిలో 2 డివిజన్లతో కలిపి 66 స్థానాలున్నాయి. కాగా, వీటి సంఖ్య మరో 34 పెరిగి 100 డివిజన్లకు చేరితే.. వరంగల్ తూర్పు, పశ్చిమలో అటుఇటుగా 12 నుంచి 14 సీట్ల చొప్పున 25 సీట్లు ఇక్కడే పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
మేయర్ ఓకే.. డివిజన్ రిజర్వేషన్ల మార్పు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక మొదటిసారి 1995లో ఎన్నికలు నిర్వహించగా జనరల్ మహిళా కోటాలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుమాను పద్మావతి మొదటి మేయర్ అయ్యారు. 2000 ఏడాదిలో జనరల్‍కు కేటాయించగా బీజేపీ నుంచి తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, 2005లో జనరల్ మహిళా కోటాలో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ మేయర్ పదవి దక్కించుకున్నారు. 2010లో ఆమె పదవీకాలం ముగిసినా.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగాక వరంగల్ కార్పొరేషన్‍ను ప్రభుత్వం 2015లో గ్రేటర్ వరంగల్‍గా అప్‍గ్రేడ్ చేసింది.
ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఈ ఎన్నికల్లో మళ్లీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. దీంతో 2016లో జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్నపునేని నరేందర్ మేయర్ అయ్యారు. 2018 డిసెంబర్‍లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తూర్పు ఎమ్మెల్యే అవడంతో.. నరేందర్ స్థానంలో అదే పార్టీకి చెందిన గుండా ప్రకాశ్‍రావు మేయర్ పీఠం దక్కించుకున్నారు. 2021 మే 7 నుంచి గుండు సుధారాణి మేయర్‍గా వ్యవహరిస్తున్నారు.
అయితే కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రిజర్వేషన్లు ఖరారు చేయగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ కేటగిరికి వచ్చింది. ఈ క్రమంలో జీడబ్ల్యూఎంసీ డివిజన్ల పెంపు జరిగితే.. మేయర్ రిజర్వేషన్ అలానే కంటిన్యూ చేసి డివిజన్లలో మాత్రం మార్పుచేర్పులకు అనుగుణంగా కొత్త రిజర్వేషన్లు ఉంటాయని చెబుతున్నారు. కాగా, ఏప్రిల్ నెల చివర్లో సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా వీటిపై స్పష్టత ఇస్తారని చెబుతున్నారు.
