ఆరడుగుల జాగ కోసం అష్టకష్టాలు

ఆరడుగుల జాగ కోసం అష్టకష్టాలు

గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల్లో అంత్యక్రియలకు ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం.. ఎలక్షన్ వచ్చినప్పుడే లీడర్లు హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో రోడ్డు పక్కనో.. లేదా చెరువు గట్ల వద్దనో అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఉన్న శ్మశాన వాటికల్లో నీటి సదుపాయం, షెడ్లు, దహన సంస్కారాల ప్లాట్​ ఫామ్స్, కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేదు.

చెరువు గట్లే దిక్కు..

జీడబ్ల్యూఎంసీలోని 66 డివిజన్ల పరిధిలో  42 విలీన గ్రామాలుండగా.. చాలా ఊర్లలో అంతిమ సంస్కారాలకు సరైన ఏర్పాట్లు లేవు. దీంతో చెరువులు, పొలం గట్లే పెద్ద దిక్కుగా మారాయి. ఎన్నికల ముందు ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి గ్రామానికి ఉమ్మడి శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  గ్రేటర్​ వరంగల్​ లో విలీనమైన వర్ధన్నపేట నియోజకవర్గం పరిధి గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్టేషన్​ ఘన్​ పూర్, పరకాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

వానాకాలం ఇబ్బందే

వర్షాకాలం వచ్చిందంటే  అంత్యక్రియలు నిర్వహించడానికి జనాలు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొన్నిచోట్ల చితికాలక ఇబ్బందులు పడిన ఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన లీడర్లు, ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడమే మానేశారు.

రివ్యూలకే పరిమితం

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలతో శ్మశాన వాటికలు డెవలప్ చేస్తోంది. స్నానాలు చేయడానికి, తాగేందుకు సెపరేట్​గా నీటి సౌకర్యం, మృతదేహాలను కాల్చేందుకు ప్రత్యేకంగా ప్లాట్​ ఫామ్స్​, కరెంట్ సౌకర్యం కల్పిస్తోంది. కానీ గ్రేటర్ వరంగల్​లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీని ఎత్తేశారు. దీంతో అటు కేంద్ర పథకానికి నోచుకోక.. ఇటు పాలకులు పట్టించుకోక అంత్యక్రియలు పూర్తి చేయడంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వైకుంఠధామాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు చాలా సార్లు రివ్యూలు కూడా నిర్వహించారు. ఆ వెంటనే కొన్ని చోట్ల ఫీల్డ్​ విజిట్​ చేసి ప్రపోజల్స్​ రెడీ చేశారు. కానీ అవన్నీ ఇప్పుడు అటకెక్కాయి.

గ్రేటర్​ వరంగల్ లో విలీనమైన హసన్ పర్తిలో ఉమ్మడి శ్మశాన వాటిక లేదు. ఇక్కడ ఎవరైనా చనిపోతే  పెద్ద చెరువు ఆనుకుని ఉన్న రోడ్డు పక్కనే దహన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోకపోవడంతో.. వివిధ కుల సంఘాలు కమ్యూనిటీల వారీగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకున్నాయి. లేనివాళ్లు అక్కడే దహనం చేస్తున్నారు.

ఇది గ్రేటర్​ వరంగల్ 65వ డివిజన్​ దేవన్నపేటను ఆనుకుని ఉన్న నిరూప్​ నగర్​ తండా. ఇక్కడ శ్మశానవాటిక లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించేవారు. గతేడాది టీఆర్ఎస్ విజయ గర్జన సభ నిర్వహించేందుకు శ్మశాన వాటిక గోడలు కూల్చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సభ వాయిదా పడినా.. తిరిగి శ్మశాన వాటిక గోడలు కట్టలేదు. లీడర్లు, ఆఫీసర్లు సైతం పట్టించుకోలేదు. దీంతో తండా వాసులు పక్కనే ఉన్న సుబ్బయ్య పల్లి చెరువు సమీపంలో అంతిమ సంస్కారాలు చేపడుతున్నారు.