ఆరు నెలలు అన్నరు..  రెండేళ్లయినా కంప్లీట్‌‌‌‌కాలే..

 ఆరు నెలలు అన్నరు..  రెండేళ్లయినా కంప్లీట్‌‌‌‌కాలే..
  • వరంగల్‌‌‌‌ కేయూ రోడ్డులో పూర్తి కాని డక్ట్‌‌‌‌, పరిమళ కాలనీ బ్రిడ్జి
  • వడ్డేపల్లి చెరువు వరదకు కూలిన జవహర్‌‌‌‌ కాలనీ బ్రిడ్జి
  • రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • పనుల విషయాన్ని పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో స్లోగా జరుగుతున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు జనాలకు చుక్కలు చూపుతున్నాయి. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను రెండేండ్లు గడుస్తున్నా కంప్లీట్‍ చేయకపోవడంతో ప్రజలకు ఆయా రూట్లలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉందనుకున్న జవహర్‌‌‌‌ కాలనీ బ్రిడ్జి కూడా ఇటీవలి వరదలకు కొట్టుకుపోవడంతో అటు వైపు కూడా రాకపోకలు బంద్‌‌‌‌ అయ్యాయి. దీంతో వరంగల్‍, హనుమకొండ నుంచి కాజీపేట వెళ్లే కేయూ 100 ఫీట్ల రోడ్‌‌‌‌పై జర్నీ అంటేనే ప్రజలు భయపడుతున్నారు.

రెండేండ్లు గడిచినా పూర్తి కాని పనులు

హనుమకొండలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో స్మార్ట్‌‌‌‌ సిటీ పథకంలో భాగంగా రూ.53 కోట్లతో డ్యూయల్‌‌‌‌ డక్ట్‌‌‌‌ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 40 అడుగుల వెడల్పుతో కింద డ్రైనేజీ, పైన రోడ్డు ఉండేలా రూపొందించారు. ఈ పనుల కోసమంటూ 2021లో కేయూ 100 ఫీట్ల రోడ్డును కెనాల్‌‌‌‌ మాదిరిగా తవ్వేశారు. దీంతో వందలాది కాలనీలను కలుపుతూ వరంగల్‌‌‌‌ నుంచి హనుమకొండ కేయూ జంక్షన్‌‌‌‌ మీదుగా కాజీపేట రైల్వేస్టేషన్‌‌‌‌కు వెళ్లే ప్రధానమైన మెయిన్‌‌‌‌ రోడ్డు బ్లాక్‌‌‌‌ అయింది. ఈ రోడ్డు ప్రయారిటీని దృష్టిలో ఉంచుకుని డ్యూయల్‌‌‌‌ డక్ట్‌‌‌‌ నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ విధించారు. కానీ రెండేండ్లు గడిచినా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

కొట్టుకుపోయిన జవహర్‌‌‌‌కాలనీ బ్రిడ్జి

కేయూ జంక్షన్‌‌‌‌ నుంచి సమ్మయ్యనగర్‌‌‌‌ మీదుగా జవహర్‌‌‌‌ కాలనీ జంక్షన్‌‌‌‌ వరకు గతంలో ఐదు నిమిషాల్లోనే చేరుకునేవారు. కానీ ప్రస్తుతం డక్ట్‌‌‌‌ పనుల కారణంగా గోపాల్‍పూర్‌‌‌‌ ఊరు మీదుగా జవహర్ కాలనీ జంక్షన్‌‌‌‌ చేరుకునే వరకు అరగంట పడుతోంది. కానీ ఇటీవల వచ్చిన వరదలకు జవహర్‌‌‌‌ కాలనీలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ మార్గంలోని రోడ్డు ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చి అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై రాకపోకలు బంద్‌‌‌‌ అయ్యాయి. దీంతో జనాలు ఇరుకు సందుల గుండా ప్రయాణించాల్సి వస్తోంది.

పరిమళకాలనీ వద్ద...

వడ్డేపల్లి చౌరస్తా మీదుగా వచ్చే ప్రయాణికులు వాటర్‌‌‌‌ ఫిల్టర్‌‌‌‌ బెడ్‌‌‌‌, ఇన్నర్‌‌‌‌ రింగ్‌ రోడ్డు, ఉనికిచర్ల, 
ధర్మసాగర్‌‌‌‌ వైపు వెళ్లేవారు. కానీ వడ్డేపల్లి జంక్షన్‌‌‌‌కు మొదట్లోనే పరిమళ కాలనీ వద్ద బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. మొత్తంగా కిలోమీటర్ దూరంలోనే మూడు బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రోడ్ల గుండా వచ్చే ప్రయాణికులు తేజ ఇంటర్నేషనల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ రోడ్డులో రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్‍ సమస్య ఏర్పడుతోంది. డక్ట్‌‌‌‌, బ్రిడ్జి నిర్మాణ పనులను ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డక్ట్‌‌‌‌ పనులు కాకనే  ఇండ్లు మునిగినయ్‍ 

డక్ట్‌‌‌‌ పనులు ఇన్‌‌‌‌టైంలో పూర్తి చేయకపోవడం వల్లే కాలనీలు నీట మునిగాయి. పనులు స్టార్ట్‌‌‌‌ అయి రెండేళ్లు అవుతున్నా ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకుంటలేరు. ఈ రోడ్డులో జనాలు నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ప్రజలకు ఉపయోగపడే పనులను త్వరగా పూర్తి చేయాలి.

ఉప్పలయ్య, నయీంనగర్, హనుమకొండ