గ్రీస్‌‌లో బోటు బోల్తా.. 78 మంది మృతి

గ్రీస్‌‌లో బోటు బోల్తా.. 78 మంది మృతి

ఏథెన్స్: గ్రీస్‌‌లోని అయోనియన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న ఫిషింగ్ బోటు పెలోపొన్నీస్ ప్రాంతం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 78 మంది చనిపోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు గ్రీస్ కోస్ట్ గార్డ్ అధికారులు బుధవారం వెల్లడించారు. 78 మంది డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటిదాకా 104 మందిని రెస్క్యూ చేసినట్లు చెప్పారు. అయితే, బోటులో మొత్తం ఎంత మంది ప్రయాణించారో ఇంకా తెలియలేదని వివరించారు.

ఎంత మంది గల్లంతయ్యారో చెప్పలేకపోతున్నామని అన్నారు. ఆరు కోస్ట్ గార్డ్ షిప్‌‌లు, ఒక నేవీ షిప్, ఆర్మీ ట్రాన్స్‌‌పోర్ట్ ఎయిర్‌‌క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్, డ్రోన్‌‌ల ద్వారా ఇంకా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌‌ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. లిబియాలోని ఈజిప్ట్, సిరియా, సూడాన్, పాకిస్తాన్ పౌరులతో సహా వేలాది మంది  వలసదారులను ఆ దేశ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ  అణచివేతకు గురిచేస్తున్నారు. దాంతో వలసదారులంతా ఇటలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లిబియా కోస్ట్ గార్డ్ గస్తీని తప్పించుకోవడానికి మంగళవారం టోబ్రూక్ ప్రాంతం నుంచి రహస్యంగా ఇటలీకి ఫిషింగ్ బోటులో బయలుదేరారు. అయితే, సముద్రంలో బలమైన గాలుల తాకిడికి ఫిషింగ్ బోటు బోల్తా పడింది.