న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇన్వెంటరీ ఆధారిత ఈ–-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దేశీయ విక్రేతలకు గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశం సులభతరం చేయడం ద్వారా దేశ ఎగుమతులను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బిజినెస్ టూ బిజినెస్ ఈ–-కామర్స్ , మార్కెట్‌ప్లేస్ మోడల్స్‌లో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది.
వినియోగదారులకు నేరుగా వస్తువులు అమ్మే బీ2సీ , ఇన్వెంటరీ ఆధారిత ఈ–-కామర్స్ విధానంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం లేదు. ఇప్పుడు చేసిన సవరణ ద్వారా విదేశీ వాటా కలిగిన కంపెనీలు ఎగుమతుల కోసం మాత్రమే వస్తువులను నిల్వ చేయవచ్చు. దేశీయ విక్రయాల కోసం ఇన్వెంటరీ ఆధారిత విధానాన్ని ఉపయోగించడానికి అనుమతి లేదు. ఈ నిర్ణయం ఫెమా నిబంధనల నోటిఫికేషన్ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
విదేశీ వ్యాపార సంస్థలు భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే ఎగుమతి చేయాలి. వీటిని భారీగా పెంచాలనే డీజీఎఫ్‌టీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం భారతదేశ ఈ–-కామర్స్ ఎగుమతుల విలువ రెండు బిలియన్డాలర్లు కాగా, చైనా ఎగుమతుల విలువ 350 బిలియన్డాలర్లు ఉంది.
ప్రపంచ ఈ–-కామర్స్ వ్యాపారం 800 బిలియన్డాలర్లు కాగా, 2030 నాటికి అది రెండు ట్రిలియన్డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. చిన్న రిటైలర్ల వ్యాపారాలకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా కేవలం ఎగుమతుల కోసం మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపాయి.
