నిర్మల్‌‌ మెడికల్ కాలేజీకి గ్రీన్‌‌ సిగ్నల్‌‌

నిర్మల్‌‌ మెడికల్ కాలేజీకి గ్రీన్‌‌ సిగ్నల్‌‌

హైదరాబాద్, వెలుగు: నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు పర్మిషన్ లెటర్‌‌‌‌ను కాలేజీ ప్రిన్సిపాల్‌‌కు పంపించింది. ఈ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లను కేటాయించింది. దీంతో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9 కాలేజీల పర్మిషన్ కోసం రాష్ట్ర సర్కార్ దరఖాస్తు చేసింది. నిర్మల్‌‌తో కలిపి ఇప్పటివరకు 8 కాలేజీలకు ఎన్‌‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది.

కరీంనగర్‌‌‌‌ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌కు అనుబంధంగా దరఖాస్తు చేసిన కాలేజీకి మాత్రం ఎన్‌‌ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, ఎన్‌‌ఎంసీ టీమ్స్ ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ హాస్పిటల్‌‌ను, కాలేజీని తనిఖీ చేశాయి. కొన్ని లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని  సూచించాయి. మరోసారి తనిఖీ చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలిపారు. ఇటీవల రిక్రూట్‌‌ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కొంత మందికి కరీంనగర్ కాలేజీలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాలేజీకి తప్పకుండా పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది  నిర్మల్‌‌, ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌‌ జిల్లాల్లో  మెడికల్​ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి.