
హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయొద్దని, దానికింద ప్రతిపాదిత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌కు జీఆర్ఎంబీ మెంబర్‌సెక్రటరీ అజగేషన్ లేఖ రాశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టడంతో.. అన్ని అనుమతులు తీసుకునే వరకు పనులు ఆపేయాలని గతంలోనే బోర్డు ఆదేశించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్ కూడా నిర్వహించింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా, దాని స్కోప్మార్చినా సంబంధిత రివర్మేనేజ్మెంట్బోర్డుతో పాటు అపెక్స్ కౌన్సిల్అనుమతి తప్పనిసరి.
ఈ అనుమతులేవి లేకుండానే గౌరవెల్లిని చేపట్టిన నేపథ్యంలో దానిలో నీటిని నిల్వ చేయవద్దని, కాల్వలకు నీటిని విడుదల చేయొద్దని తేల్చిచెప్పింది. జలయజ్ఞంలో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.04 టీఎంసీలతో నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీని సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెంచారు. పర్యావరణ అనుమతులు లేకుండానే రిజర్వాయర్ కెపాసిటీ పెంచడంతో నిర్వాసిత గ్రామాల రైతులు ఎన్జీటీ చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించడంతో ట్రయల్‌రన్ తర్వాత నీటి పంపింగ్ నిలిపివేశారు.