కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట కరోనా విషాదాన్ని నింపింది. కరోనా వైరస్ బారిన పడి వరుడు మృతి చెందిన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకుంది. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడు(28) గతనెల 28న తీవ్ర జ్వరం బారినపడ్డాడు. దీంతో స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించగా… ముందు జాగ్రత్త కోసమని ఆమె కరోనా పరీక్షలు నిర్వహించడానికి నమూనాలు సేకరించారు. ఇంతలో యువకుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆ యువకుడు మృతి చెందాడు. తెల్లవారితే పెళ్లి మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినవాడిని కరోనా అన్యాయంగా బలి తీసుకుంది. అతని మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కొడుకు మరణంతో ఆ వరుడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

