హైదరాబాద్, వెలుగు: సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. బోర్లు నీళ్లు పోయడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్మోటార్లను మరింత లోతుకి దించుతున్నారు. దించినా ఉపయోగం లేనిచోట వాటర్‌ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. హయత్ నగర్, శేరిలింగంపల్లి, తిరుమలగిరి, జగద్గిరిగుట్ట, బండ్లగూడ జాగీర్, షేక్ పేట, నార్సింగి, మణికొండ, పుప్పాల్ గూడ తదితర ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో గత నెలతో పోలిస్తే వాటర్ లెవల్స్16 చోట్ల తగ్గినట్లు తెలిసింది. కూకట్ పల్లి ప్రాంతంలో 2 మీటర్లకు పైగా లోతుకి పడిపోయాయి. ఎండలు దంచికొట్టడంతోపాటు సమయానికి వర్షాలు కురవకపోవడమే కారణమని అధికారులు అంటున్నారు. వానలు కురిసిన టైంలో ఇంకుడు గుంతల నీటిని ఇంకించాలని సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా, వెంటనే భూగర్భ జలాలు పెరగవని, రీచార్జ్ అవడానికి 20 రోజుల టైమ్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
బోర్లను దించుతున్నరు
భూగర్భ జలాలు తగ్గడంతో బోర్లు ఎండుతున్నాయి. చాలాచోట్ల కరెంట్బోర్లను లోతుకు దించుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో బోర్లను దించేశారు. గతేడాది డిసెంబర్ వరకు వాటర్ లెవల్స్బాగానే మెయింటెన్ అయినప్పటికీ, ఈ ఏడాది జనవరి నుంచి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రూరల్ ఏరియాల్లో పెద్దగా సమస్య లేదు. వర్షాలు కురవకపోతే సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అదనపు భారం
నల్లాల ద్వారా వాటర్‌బోర్డు అందించే నీళ్లు చాలాక జనం వాటర్ ట్యాంకర్లను బుక్చేసుకుంటున్నారు. అపార్టుమెంట్లలో ఒక్కో ఫ్యామిలీ రెండు రోజులకు రూ.150 చెల్లించాల్సి వస్తోంది. కొన్ని సెక్షన్లలో బుక్ చేసిన రెండు, మూడు రోజులకు ట్యాంకర్ వస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా 570 ఎంజీడీల నీటి డిమాండ్ ఉంది. ఆ మేరకు నీరు సరఫరా కాకపోవడం, కొన్నిచోట్ల అరకొర రావడంతో నీటి ఎద్దడి పెరిగింది. డైలీ 3 వేలకి పైగా వాటర్ ట్యాంకర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. మాదాపూర్, సైనిక్ పురి, నానక్ రాంగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , కూకట్ పల్లి, హైదర్ నగర్, కుత్బుల్లాపూర్, మణికొండ, కూకట్ పల్లి, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఎల్బీనగర్, ఎస్ఆర్ నగర్, గోషామహల్, నారాయణగూడ, నిజాంపేట తదితర ప్రాంతాల నుంచి బుకింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి.
రూ.వెయ్యి నుంచి 3 వేల వరకు..
వాటర్‌బోర్డు అందించే ట్యాంకర్లు లేట్అవుతుండటంతో జనం ప్రైవేట్ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. వాటర్‌బోర్డు 5 వేల లీటర్ల పెయిడ్ట్యాంకర్ కు రూ.500 వసూలు చేస్తుండగా, కమర్షియల్ ట్యాంకర్లకు రూ.850 వసూలు తీసుకుంటోంది. అవి అందుబాటులో లేనిచోట చాలామంది ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నా రు. డిమాండ్పెరగడంతో 5 వేల లీటర్ల ట్యాంకర్ కు రూ.1000 –1500, 10 వేల లీటర్ల ట్యాంకర్ కు రూ.2,500 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ట్యాంకర్ డీటెయిల్స్ ను వాటర్‌బోర్డులో నమోదు చేసుకోవాలని, సూచించిన ధరలకే నీటిని సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా ఆపరేటర్లు పట్టించుకోవడంలేదు.
