- లోన్లపై వడ్డీ పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- హోమ్ , కారు లోన్ల ఈఎంఐఈలు పైకి
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్‌ఆర్) ను.. అంటే కనీసం వసూలు చేసే వడ్డీ రేటును తాజాగా 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. పెరిగిన కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
ఈ నెల 5న జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 5.25శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం లోన్ రేట్లను పెంచడం గమనార్హం. ఈ పెంపుతో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లు లోన్ కాలపరిమితిని బట్టి 8.05శాతం నుంచి 8.65శాతం పరిధిలోకి చేరాయి.
చాలా రిటైల్ లోన్లకు బెంచ్‌మార్క్‌గా ఉండే 'వన్ -ఇయర్ ఎంసీఎల్ఆర్' 8.35శాతం నుంచి 8.40శాతానికి, అంటే 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెండేళ్ల కాలపరిమితిపై అత్యధికంగా 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.55శాతానికి చేరింది. కేవలం ఒక -నెల వ్యవధి గల లోన్ రేటులో (8.05శాతం) ఎలాంటి మార్పు లేదు.
ఎంసీఎల్ఆర్ పెరగడం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ వంటి రిటైల్ రుణాలపై నెలవారీ ఈఎంఐలు పెరుగుతాయి. జనరల్ కస్టమర్లకు ఎఫ్‌డీలపై 2.75శాతం నుంచి 6.50శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25శాతం నుంచి 7శాతం వరకు వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
