- సబ్సిడీ యూరియా ఇవ్వడం లేదు
- పంట నష్టపోతే పరిహారం దక్కట్లే
- మార్కెట్‌లో కనీస మద్దతు ధరా అందదు
- 85.2% కౌలు రైతులు పంట నష్టపోతే 0.7 శాతానికే పరిహారం
- ‘కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ నివేదికలో చేదు నిజాలు
- 1,816 మంది కౌలు రైతులను సర్వే చేసిన కమిటీ
- గుర్తింపు కార్డులు ఇచ్చి, వారిని ఆదుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కౌలు రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు సాగుచేస్తుంటే, ఫలితం మాత్రం భూయజమానులకే దక్కుతోందని, కష్టం కౌలు రైతులదైతే, సర్కారు ఇస్తున్న రైతుభరోసా, బోనస్, సబ్సిడీలు, బ్యాంకు లోన్లు భూయజమానులకే అందుతున్నాయని ‘కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ సర్వేలో తేలింది. కౌలురైతులు వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలోని 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామా ల్లో 1,816 మంది కౌలు రైతులపై చేసిన ఈ సర్వేలో అనేక ఆందోళనకర అంశాలు తెలిశాయి. రాష్ట్రంలో ని 36 శాతం ఉన్న కౌలు రైతులకు గుర్తింపు లేకుండా రాష్ట్ర వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది.
పెరిగిన కౌలు భారం
సర్వేలో పాల్గొన్న కౌలు రైతుల్లో 47.2 శాతం బీసీలు, 26.9 శాతం ఎస్సీలు, 13.9 శాతం ఎస్టీలు ఉన్నారు. సాధారణ జనాభాతో పోలిస్తే కౌలు సాగులో బీసీలే అధి కంగా ఉన్నట్లు తేలింది. ఓసీల వాటా 7.5 శాతం మాత్రమేనని స్పష్టమైంది. ప్రస్తుతం కౌలు ధరలు రైతులకు భారంగా మారాయి. ఎకరాకు గరిష్ఠంగా రూ.53 వేల వరకు కౌలు చెల్లిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. సగటు కౌలు ధర ఎకరాకు రూ.14,936గా నమోదైంది. గత 2022లో సగటు కౌలు భూమి 5 ఎకరాలు ఉండగా ప్రస్తుతం అది 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న రైతులు సరిపడా ఆదాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ ప్రయోజనాలేవీ అందవు
యాప్ ఆధారిత విధానాల కారణంగా కౌలు రైతులకు సబ్సిడీ యూరియా అందడం లేదని సర్వే స్పష్టం చేసింది. భూయజమాని మొబైల్‌కు వచ్చే ఓటీపీ తప్పనిసరి చేయడంతో 1,816 మంది రైతుల్లో కేవలం 412 మంది (22.8%) మాత్రమే రూ.260 చొప్పున సబ్సిడీ యూరియాను పొందగలిగారు. మిగిలిన వారు బ్లాక్ మార్కెట్‌లో బస్తాకు రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి కూడా భూయజమాని ఆధారిత ఓటీపీ, బయోమెట్రిక్ నిబంధనలు ప్రధాన అవరోధంగా మారాయి. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే సీసీఐకి నేరుగా అమ్మగలిగారు.
వరి రైతుల్లో వానాకాలంలో 20 శాతం(886మందిలో 177 మంది), యాసంగిలో 17.2 శాతం మంది(766 మందిలో 135మంది) మాత్రమే తమ పేరుపై విక్రయాలు చేశారు. మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల్లో నేరుగా విక్రయించిన కౌలు రైతుల శాతం కేవలం 8.5 మాత్రమేనని స్పష్టమైంది. ప్రభుత్వ కొనుగోళ్లకు దూరమవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలను అమ్ముకోవాల్సి వస్తోంది. పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా, మార్కెట్‌లో సగటున రూ.6,500కే అమ్ముడవుతోంది. ఐదు ఎకరాల కౌలు రైతుకు పంటల వారీగా రూ.40 వేల నుంచి రూ.88 వేల వరకు ఆదాయ నష్టం వాటిల్లుతున్నట్లు కమిటీ అంచనా వేసింది.
ప్రైవేట్ అప్పులు, అధిక వడ్డీలు
బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడంతో కౌలు రైతులు ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వం రుణమాఫీ పథకం ప్రయోజనాలు కౌలు రైతులకు అందలేదు. గత మూడేళ్లలో వరదలు, భారీ వర్షాలు, వడగండ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు.
అయితే పంట నష్టపోయిన 1,573 మందిలో కేవలం 11 మంది మాత్రమే (0.7శాతం) తమ ఖాతాల్లో నష్టపరిహారం పొందగలిగారు. కొన్ని సందర్భాల్లో భూయజమానుల ఖాతాలకు పరిహారం జమ అయినప్పటికీ, అది కౌలు రైతులకు చేరలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై కౌలు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది గుర్తింపు కోసం ఉద్యమించేందుకు సిద్ధమని ప్రకటించారు. రైతు భరోసా కంటే ముందుగా సబ్సిడీ ఎరువులు, పంట నష్టపరిహారం, మద్దతు ధరకు పంట కొనుగోలు వంటి సదుపాయాలను నేరుగా తమకే అందించాలని కోరారు.
గుర్తింపు కార్డులు జారీ చేస్తేనే..
కౌలు రైతులకు ప్రతి ఏడాది గుర్తింపు కార్డులు జారీ చేయాలని, 2011 భూఆధీకృత సాగుదారుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. కౌలు రైతుల గుర్తింపు కార్డులను బ్యాంకు ఖాతాలు, పంట రుణాలు, సబ్సిడీలు, పంట కొనుగోలు వ్యవస్థలతో అనుసంధానం చేయాలని కోరింది.
కౌలు రైతులకే రైతుభరోసా ఇవ్వాలి
రైతు భరోసా, ఇతర వ్యవసాయ పథకాలను వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకే వర్తింపజేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కౌలు రైతులపై నిర్వహించిన సర్వే నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వాస్తవ సాగుదారుకు సంబంధించిన కాలమ్–16ను పునరుద్ధరించాలని, కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. గతంలో రైతుబంధు నిధుల్లో భారీ మొత్తాలు సాగుతో సంబంధం లేని వారి ఖాతాల్లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట సాగు చేసే వారికే ప్రభుత్వ ప్రయోజనాలు అందాలని కోరారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
కౌలు రైతులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలకు చెందిన నలుగురు కౌలు రైతులు, మహిళా కిసాన్ అధికార మంచ్ ప్రతినిధి డాక్టర్ రుక్మిణి రావు, రైతు స్వరాజ్యవేదిక నాయకులు కన్నగంటి రవి, నర్సింహారెడ్డి, కొండల్ రెడ్డి, విస్సా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
