ఇక పంటల సాగుకు  డోకా లేనట్టే!..ఖమ్మం జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు 

ఇక పంటల సాగుకు  డోకా లేనట్టే!..ఖమ్మం జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు 
  • ఈ సీజన్​ సాగర్​ఆయకట్టుకు సాగునీటి ప్రణాళికను ఖరారు చేసిన ఆఫీసర్లు
  • విడతలవారీగా 78 రోజుల పాటు నీటి విడుదలకు ప్లాన్
  • ఇప్పటికే 5,57,221 ఎకరాల్లో పంటల సాగు
  • అత్యధికంగా పత్తి సాగు వైపే రైతుల మొగ్గు 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లాలో ఈ సీజన్​ లో పంటల సాగుకు డోకా లేనట్టే కనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గతేడాది జులై నెలతో పోలిస్తే, ఈసారి భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగైదు రోజులుగా ఎండగా ఉంటున్నా, బోర్లు, బావుల్లో నీరుండడంతో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండాపోయింది. మరోవైపు ఈ వానాకాలం పంటల కోసం సాగర్​ ఆయకట్టు కింద నీటి విడుదల ప్రణాళికను కూడా అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో సాగర్​ ఆయకట్టు 2.54 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఆయకట్టులో రైతులు వరి, మొక్కజొన్న, పెసర, పత్తి, మిరపను రైతులు పండిస్తున్నారు. ఈ పంటల కోసం నవంబర్​ 22 వరకు ఏడు విడతల్లో 78 రోజుల పాటు 33.58 టీఎంసీల నీటిని చేయాలని ఇరిగేషన్​ అధికారులు ప్లాన్​ చేశారు. 

జిల్లాలో 6,34,255 ఎకరాల్లో పంటల సాగు..!

ఖమ్మం జిల్లాలో ఈ సీజన్​ లో 6,34,255 ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 5,57,221 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 2,20,650 ఎకరాల్లో సాగు చేశారు. ఆ తర్వాత వరి 1,96,829 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ వరిలో ఇప్పటి వరకు నేరుగా వెదజల్లే పద్దతిలో 58,425 ఎకరాల్లో సాగు చేయగా, 1,38,404 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 17,237 ఎకరాల్లో పెసర, 1613 ఎకరాల్లో మొక్కజొన్న, 413 ఎకరాల్లో చెరకు, 254 ఎకరాల్లో కంది, 86,971 ఎకరాల్లో జీలుగు పంట వేశారు.

గతేడాది జిల్లాలో 93 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ఈసారి 64 వేల ఎకరాలకు మిర్చి సాగు తగ్గుతోంది. ఇందులో 390 ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు మిర్చి పంట వేశారు. గత మూడేండ్లలో మిర్చి పంట రేటు క్వింటాకు రూ.25 వేల నుంచి కనిష్టంగా రూ.8 వేల వరకు ధర పడిపోవడంతో ఆ ప్రభావం ఈసారి మిర్చిపంట సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రైతులు ఈసారి పత్తి ఎక్కువగా సాగు చేస్తున్నారు. 

గతేడాది కన్నా మెరుగ్గా భూగర్భ జలాలు.. 

ఇక జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సారి  భూగర్భ జలాల పరిస్థితి మెరుగ్గానే ఉంది. గతేడాది జిల్లా యావరేజీగా జులై నెలలో 4.59 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలుండగా, ఈ సారి 3.87 మీటర్లకు భూగర్భ జలమట్టం పెరిగింది. 21 మండలాలకు గాను 7 మండలాల్లో గతేడాది కంటే స్వల్పంగా భూగర్భ జలాలు తగ్గాయి. గత రెండు నెలల్లో వర్షాలు పడుతూ, మళ్లీ కొద్ది రోజుల పాటు వానలు కనుమరుగవుతూ ఎండలు కొడుతుండడంతో విచిత్రమైన పరిస్థితి ఉంది. అయితే వర్షం లేకపోవడం, భూగర్భ జలాలు పెరగడంతో రైతులు తమ బోర్లు, బావులను ఉపయోగించుకోవాల్సి వస్తోంది.