
ముషీరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అశోక్ నగర్ చౌరస్తాకు అభ్యర్థులు చేరుకొని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థులు నరసింహ, నాగరాజు, ఇంద్ర నాయక్, రవికుమార్, జనార్దన్, విక్రమ్, శంకర్ నాయక్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు లాంటిదని, డివిజన్ బెంచ్ కు వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.
గ్రూప్–1 ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసే జీవో నంబర్ 29ను వెంటనే రద్దు చేయాలన్నారు. దీనిని అడ్డుగా పెట్టుకొని గ్రూప్ 2, 3 లో ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆపొద్దని కోరారు.