షెడ్యూల్​ ప్రకారమే గ్రూప్1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్

షెడ్యూల్​ ప్రకారమే గ్రూప్1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్
  • ముందుగా ఏఈ, ఏఈఈ పరీక్షలకు అమలు
  • డీఏవో, గ్రూప్స్ మాత్రం ఆఫ్​లైన్​లోనే నిర్వహణ
  • వాయిదా పడ్డ పరీక్షలన్నీ మే, జూన్​లోనే
  • టీఎస్​పీఎస్సీ నిర్ణయం.. ఇవాళో, రేపో అధికారిక ప్రకటన
  • హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్.. జూన్ 17న పరీక్ష

హైదరాబాద్, వెలుగు: ఇకపై మెజారిటీ రిక్రూట్​మెంట్​ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. గ్రూప్స్, డీఏవో మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఆన్​లైన్​లోనే జరపనున్నది. ప్రస్తుతం రద్దయిన, వాయిదా పడ్డ పరీక్షలను మే, జూన్​ లో నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్​ను నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నది.

లక్ష అప్లికేషన్లు దాటితే ఆఫ్​లైన్!

గతేడాది 17 వేలకుపైగా పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు ఏడు పరీక్షలు నిర్వహించింది. అయితే, క్వశ్చన్ పేపర్ లీక్ తో వీటిలో నాలుగు
పరీక్షలను రద్దు చేసింది. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్​లో జరగాల్సిన మరో 4పరీక్షలను వాయిదా వేయనున్నది. మార్చి 5న ఆఫ్​లైన్​లో జరిగిన ఏఈ పరీక్ష, జనవరి 22న ఆఫ్​లైన్​లో జరిగిన ఏఈఈ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్​ మెంట్లకు ఒక్కొక్కరికీ ఒక్కోరోజు చొప్పున మూడ్రోజుల పాటు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చి, రద్దయిన డీఏవో ఎగ్జామ్​ను, టౌన్​ ప్లానింగ్ ఎగ్జామ్​ను ఆఫ్ లైన్​లో పెట్టాలని భావిస్తున్నారు. వెటర్నరీ సర్జన్ ఎగ్జామ్ మాత్రం ఆన్​​లైన్ లో నిర్వహించనున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలను వాయిదా వేసి, ఆన్​లైన్​లోనే పెట్టనున్నారు. గ్రౌండ్ వాటర్​లో పరీక్షను రెండ్రోజులు పెట్టే యోచనలో ఉన్నారు. లైబ్రరియన్, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలనూ ఆన్‌‌‌‌ లైన్​లోనే నిర్వహించనున్నారు.

గ్రూప్స్1 ప్రిలిమ్స్ జూన్​ 11నే

గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు కావడంతో, జూన్ 11 నిర్వహిస్తామని అధికారులు గతంలోనే రీషెడ్యూల్ ఇచ్చారు. ఈ పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం అభ్యర్థుల్లో ఉంది. జూన్​ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు, జులై 1న గ్రూప్ 4 పరీక్షనూ యథావిధిగా నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. అయితే, పరీక్షపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.

హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను జూన్ 17న నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.