
రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇటీవలే విడుదల చేసింది. లక్షల్లో అభ్యర్థులు అప్లై చేసుకోనుండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ రెండు పరీక్షల్లో సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. కామన్ ప్రిపరేషన్‌తో రెండు ఉద్యోగాల్లో సక్సెస్ ఎలా సాధించాలో తెలుసుకుందాం..
గ్రూప్–2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 3 లో మూడు పేపర్లు ఉండగా, ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2, 3 పరీక్షలో 60శాతం మార్కులు సాధిస్తే కొలువు సాధించవచ్చు. సిలబస్‌లో ఉన్న అంశాలపై ఫోకస్ చేస్తూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తే కొలువు సులువుగా కొట్టవచ్చు.
పేపర్ 1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్)
సిలబస్ ప్రకారం ఇందులో మొత్తం 11 అంశాలు ఉంటాయి. విస్తృతమైన సిలబస్ ఉండడంతో ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. 11 అంశాల్లో కేవలం సబ్జెక్టు పేరు మాత్రమే ఇచ్చి, చాప్టర్ల గురించి కాని వెయిటేజి గురించి కాని ఇవ్వలేదు. కాబట్టి ముందు మిగతా పేపర్లు చదివిన తర్వాతే, పేపర్ 1 ప్రిపరేషన్ కొనసాగించాలి.
గ్రూప్ 2, 3 రెండు ఎగ్జామ్స్‌లోనూ పేపర్ 1సిలబస్‌లో సేమ్ టాపిక్స్ ఉంటాయి. ప్రిపరేషన్లో ముఖ్యంగా ఇంగ్లీష్ , అర్థమెటిక్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువగా పేపర్1లో మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటి నుంచి సుమారు 40 నుంచి 50 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంది. వీటి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడితే మొదటి పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర పాలసీలు తెలంగాణ ఎకానమీలో భాగంగా కవర్ అవుతాయి. సోషల్ ఎక్స్‌క్లూజన్, రైట్ ఇష్యూస్ మరియు ఇన్‌క్లూజన్ పాలసీలు పాలిటీలో భాగంగా ఉంటాయి. తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, కళలు, సాహిత్యానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందినవి రెండో పేపర్లో పూర్తిగా కవర్ అవుతాయి. ఇండియా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ సిలబస్ దాదాపు పేపర్ 1తో పాటు పేపర్ 2లో భాగంగా ఉంటాయి. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, సంబంధాలు, సంఘటనలు దాదాపు ఒక దానికొకటి అనుసంధానంగా ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీకి సమకాలీన అంశాలు చదివితే సరిపోతుంది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అట్లాస్‌పై ఫోకస్ చేయాలి. తెలంగాణ జాగ్రఫీ దాదాపు మూడో పేపర్లో భాగంగా కవర్ అవుతుంది.
పేపర్ 2 (చరిత్ర, పాలిటీ, సమాజం)
పేపర్2 లో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో పేపర్ 2 సిలబస్ గ్రూప్ 2 ,3 రెండింటికి ఒకటే ఉద్యమం ఒక్కటే గ్రూప్2 లో 150 మార్కులకు ఉంటుంది. కాని గ్రూప్ 3లో 30 నుంచి 40 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ పేపర్ కోసం గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదవాలి, కాని జనరల్ స్టడీస్‌లో భాగంగా చదవకూడదు.
పేపర్ 3 ( ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి)
ఈ పేపర్లో మొత్తం మూడు సబ్జెక్టులుగా ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అనే అంశాలను ఇచ్చారు. కొత్తగా ఇందులో జనాభా, బడ్జెట్, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను చేర్చారు. గ్రూప్2, 3లో రెండింటిలో సిలబస్ పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. సిలబస్ లిమిటెడ్‌గా ఉండి, మార్కెట్లో పుస్తకాలు కూడా పరిమితంగా దొరకడంతో ప్రిపరేషన్ సమయం వృథా కాకుండా ఎక్కువ మార్కులు సాధించే చాన్స్ ఈ పేపర్లో ఉంది.
పేపర్ 4 ( తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర ఆవిర్భావం)
గ్రూప్ 2లో ఒక పేపర్‌గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. గ్రూప్ 3లో రెండో పేపర్లో భాగంగా ఇస్తారు. గ్రూప్ 2 కు ఇచ్చిన ఉద్యమ చరిత్ర మీద ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అయితే గ్రూప్ 3లో సులభంగా మార్కులు సాధించవచ్చు.
గ్రూప్-2 లక్షణాలు: గ్రూప్2 ఆబ్జెక్టివ్ పరీక్ష విధానం కాబట్టి సాధారణంగా చాలామంది అభ్యర్థులు ఉత్సాహం చూపుతారు. గ్రూప్-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్-3, ఇతర పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. అవసరమైతే బట్టీ పట్టయినా సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. ఎకానమీలో విస్తృతమైన గణాంకాలు, భారతదేశ, తెలంగాణ చరిత్రల్లో, తెలంగాణ ఉద్యమంలో క్రోనాలజీ, రాజ్యాంగంలో ఆర్టికల్స్, కోర్టు కేసులపై పట్టు, విశ్లేషణ సామర్థ్యాలు అవసరం. గ్రూప్-3 లక్షణాలు: సిలబస్ సేమ్ ఉండడంతో గ్రూప్-2 గట్టిగా ప్రిపేరయితే గ్రూప్-3 సులభంగానే సాధించవచ్చు. గ్రూప్-2లో పేర్కొన్న లక్షణాలన్నీ గ్రూప్-3 అభ్యర్థులకు కూడా ఉండాలి. గ్రూప్ 3 మాత్రమే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే.. సిలబస్‌లోని అంశాలపై ప్రాథమిక అవగాహన, ఫ్యాక్ట్ ఆధారిత ప్రశ్నలు, సమాచారంపై ఆధారపడిన ప్రిపరేషన్. గ్రూప్-2 అభ్యర్థులతో పోటీపడేందుకు విశ్లేషణాత్మక, అన్వయాత్మక ప్రశ్నలకు కూడా తయారయ్యేలా సమయం కేటాయించుకొని ప్లాన్ అమలు చేయాలి.
సొంత నోట్స్ బెస్ట్
ప్రిపరేషన్ సమయంలో పలు పేపర్లలో ఉమ్మడిగా ఉన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదువుతూ నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు, రాజ్యాంగం, ఎకానమీ, అభివృద్ధి టాపిక్స్ లింక్ చేసుకుంటూ సమకాలీన అంశాలు జోడించుకుంటూ చదవాలి. అభ్యర్థులు ముందుగా సిలబస్ మీద స్పష్టత తెచ్చుకొని ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్ 2, 3 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించవచ్చు.
పృథ్వీ కుమార్ చౌహాన్
పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్