- భార్యతో గొడవ పడి కూతురిని నెట్టేయడంతో మృతి
- పెద్దపల్లి జిల్లాలో పది రోజుల కింద ఘటన
- భర్తపై ఇటీవల పోక్సో కేసు.. బాలిక మృతి విషయాన్ని వెల్లడించిన భార్య
సుల్తానాబాద్, వెలుగు : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఓ పది నెలల చిన్నారి బలైంది. భార్యతో గొడవ పడుతున్న టైంలో చిన్నారి దగ్గరకు రావడంతో ఆగ్రహంతో నెట్టివేయగా తలకు బలమైన గాయమై చనిపోగా.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించారు. సదరు వ్యక్తి ఇటీవల ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు అయింది. దీంతో విసుగు చెందిన భార్య.. కూతురిని సైతం అతడే చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దేవునిపల్లి గ్రామానికి చెందిన షేర్ల హరీశ్‌కు ఇదే గ్రామానికి చెందిన భవానీతో వివాహమైంది. వీరికి 10 నెలల కూతురు విష్ణుప్రియ ఉంది. హరీశ్ ఈ నెల 18న రాత్రి పొద్దు పోయాక ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే చిన్నారి విష్ణుప్రియ నిద్ర నుంచి లేచి తల్లిదండ్రుల వద్దకు రావడంతో హరీశ్ చిన్నారిని నెట్టివేయడంతో కింద పడింది.
తలకు బలమైన గాయం కావడంతో వెంటనే పెద్దపల్లి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బాలిక చనిపోయింది. అయితే చిన్నారి మంచం పైనుంచి పడి చనిపోయినట్లు చెప్పాలని భార్య భవానీని బెదిరించి, అందరినీ అలాగే నమ్మించాడు. ఇదిలా ఉండగా... హరీశ్ ఇటీవల ఓ బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న భవానీ విసుగు చెంది.. హరీశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ సుబ్బారెడ్డి తెలిపారు.
