- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఘటన
నేరడిగొండ, వెలుగు : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో నాలుగేండ్ల చిన్నారితో పాటు మరో వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు 49 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళ్తోంది. ఆదివారం తెల్లవారుజామున నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకోగానే బస్సు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ప్రమాదంలో దిప్సన్ సింగ్ (4) అనే చిన్నారితో పాటు కండక్టర్ రవి సింగ్ (60) అక్కడికక్కడే చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవర్ గోవింద్ ప్రసాద్ జైస్వాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.
ప్రమాదం కారణంగా హైవేపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ రమేశ్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ హరీంద్రకుమార్ ఉన్నారు.
